Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ధర్నాతో కదిలిన అధికారులు
- సర్కిళ్ల వారీగా వేరుచేస్తున్న జీహెచ్ఎంసీ
- అధికారులతో కమిషనర్ సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎట్టకేలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీతో పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. లక్షల ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్ణయించాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచి 7లక్షలకుపైగా మంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలోనే లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపికచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పరిశీలనా జరగలేదని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. లబ్దిదారులు మాత్రం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాతో కదలిన అధికారులు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లవారీగా లిస్టు తయారుచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
7 లక్షలకుపైగా దరఖాస్తులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 7లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2,84,305 మంది దరఖాస్తు చేసుకున్నట్టు హైదరాబాద్ కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. వీటిలో జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే, రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి.
జిల్లాలో 9,453 ఇండ్లే
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలో 9,453 ఇండ్లు, రంగారెడ్డి, 23,908, మేడ్చల్-మల్కాజ్గిరిలో 38,419, సంగారెడ్డిజిల్లాలో 28,220 ఇండ్లను నిర్మించారు. అయితే హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 2,84,305 మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాని హైదరాబాద్ జిల్లాలో నిర్మించింది 9.453 ఇండ్లే. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్లను కేటాయించారు. కాని ఇండ్లను మాత్రం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా నిర్మించారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులకు ఎక్కడా కేటాయిస్తారో?అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
లక్ష ఇండ్ల నేపథ్యం..
గ్రేటర్ హైదరాబాద్లో రూ.9,714.59కోట్లతో లక్ష ఇండ్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. 40ప్రాంతాల్లో ఇన్సిటూ(పాత ఇండ్లను కూల్చేసి కొత్త నిర్మించడం)లో భాగంగా 8,898 ఇండ్లను 71ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 91,102ఇండ్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 38,419, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇండ్లు ఉన్నాయి.