Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై బీజేపీ గూండాల దాడికి మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యకులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తున్న కేంద్రప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జులై 3న జరిగిన బహిరంగ సభలో వర్గీకరణపై మాట్లాడని బీజేపీ వైఖరిపై నిరసన తెలియజేస్తున్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులపై తీవ్రదాడి చేసిన బీజేపీకి తెలంగాణలో మాదిగల సత్తా చూపుతామన్నారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి నమ్మకద్రోహం చేస్తున్న బీజేపీ రేపు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీకి మనస్సాక్షి ఉంటే వర్గీకరణ చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసిన ఎంఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి బిక్కి మురళి కష్ణ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, కార్యదర్శి రఘువరన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ బుషిపాక గణేష్ మాదిగ, నాయకులు అరుణ్ మాదిగ, బాలు యాదవ్, ఎల్లపాగా భాస్కర్ మాదిగ, జనపాల మహేష్, దశరథ్, సన్నీ, రాజీవ్ పాల్గొన్నారు.