Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విదేశీ యూనివర్సిటీలతో ఓయూ అవగాహన ఒప్పందాల పరంపర కొనసాగుతోంది. తాజాగా జెనెటిక్స్, బయోటెక్నాలజీ రంగంలో పశ్చిమ ఆస్ట్రేలియాలోని మార్డోక్ విశ్వవిద్యాలయంతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడి పరిశోధనలు చేసేందుకు ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి. విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర ఆలోచనా మార్పిడి వల్ల ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ దక్పథం మరింత బలపడనుంది. రెండు విశ్వవిద్యాలయాల మధ్య జరిగిన పరస్పర అవగాహన ఒప్పందంపై ఓయూ సీఎఫ్ఆర్డీ డైరెక్టర్, జెనెటిక్స్, అండ్ బయోటెక్నాలజీ హెడ్ ప్రొ. స్మితా సి. పవార్ ఓయూ తరుపున నుంచి సంతకం చేశారు. మార్డోక్ యూనివర్శిటీ ప్రొ.వైస్ ఛాన్సలర్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ కెల్లీ స్మిత్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీస్ ఇంటర్నేషనల్ చైర్, డైరెక్టర్, స్టేట్ అగ్రికల్చర్ బయో టెక్నాలజీ సెంటర్ ఫుడ్ ఫ్యూచర్స్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ వర్ష్నే సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, సాంస్కతిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి డేవిడ్ టెంపుల్ మెన్, పశ్చిమ ఆస్ట్రేలియా విద్యాశాఖ దక్షిణాసియా, భారత-గల్ఫ్ వ్యవహారాల డైరెక్టర్ జమాల్ ఖురేషి సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. విద్య, పరిశోధనల్లో విదేశీ విశ్వవిద్యాలయాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర ఆలోచనల మార్పిడికి ఎంఓయూలు ఉపయోగపడతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. రెండు యూనివర్శిటీల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఇంది ఎంతగానో తోడ్పడుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఒప్పందాలు కేవలం సంప్రదాయం వరకే పరిమితం కాకుండా అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పరిశోధనలల్లో పరస్పరం సహకరించుకోవటం ద్వారా నూతన ఆవిష్కరణలకు నాంది కావాలని ఆకాంక్షించారు. రెండు విశ్వవిద్యాలయాల పరస్పర సహకారంతో డ్యూయల్ డిగ్రీలు, సర్టిఫికెట్ కోర్సులు ఆవిష్కారం కానున్నాయని, ఈ ఒప్పందం భవిష్యత్తులో మంచి ఫలితాలు తీసుకురానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకన్నా మించి ఓయూ అంతర్జాతీయ గుర్తింపు తీసుకురానుందని స్పష్టం చేశారు.