Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఓయూ వీసీ ప్రొ. డి. రవీందర్ యాదవ్కు సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచే ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు వస్తున్నారు చెప్పారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రధానితో సహా ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఆయారంగాల్లో మేధావులు, నిపుణులను అందజేసినట్లు గుర్తు చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఓయూ జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించటానికి దోహదపడ్డ అంశాలు ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, విద్యాపరవమైన విషయాలపై ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్కు వివరించారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఓయూకు ఉత్తమ ర్యాంకు రావటం సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా దత్తాత్రేయ చెప్పారు. అందుకే పూర్వ విద్యార్థిగా ఓయూ పాలకవర్గాన్ని అభినందించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఉస్మానియా అధ్యాపకులంతా ఐఐటీ రామయ్యను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. తక్కువ నిధులు, వసతులతో ప్రయివేటు రంగంతో ఢకొీనాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఎదగటం ఏమాత్రం పెద్ద విషయం కాదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం ద్వారా దేశ రూపురేఖలు మారనునట్లు చెప్పారు. ఓయూకు నిధుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. డీపీఆర్లు రూపొందించి తన వద్దకు రావాలని, అజీమ్ ప్రేమీజీ లాంటి విద్యాప్రియుల నుంచి నిధులు ఇప్పించేందుకు కషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రామీణ, పేద విద్యార్థులు చదివే ఓయూలాంటి విశ్వవిద్యాలయాలు మేటిగా రాణించటం శుభసూచకమని అన్నారు. ఆయా విభాగాలు ప్రభుత్వ ప్రయివేటు రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని, అప్పుడే మౌలిక వసతులు మరింత మెరుగవటానికి అవకాశం ఏర్పడుతుందని సూచించారు. క్యాంపస్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడవద్దని, అప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని హితవు పలికారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవటం, పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారానే సమూల మార్పులు సాధ్యమన్నారు. ఆ దిశగా అడుగులు వేయాలని వివరించారు. ఐక్యంగా ఓయూ యంత్రాంగమంతా కలిసికట్టుగా పనిచేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఓయూను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అనంతరం వీసీ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొ పి. లక్ష్మీనారాయణ దత్తాత్రేయను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, ప్రిన్సిపల్స్, డైరెక్టర్లు, ప్రొఫసర్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.