Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల కలిగే విపత్తుకు లానీనా కారణమని, ఇలాంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ సమీక్ష నిర్వహించాలని, సీఎం వ్యాఖ్యలు అవగాహన లోపమే అని పర్యావరణవేత్త డాక్టర్ దొంతి నర్సింహా రెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలుత పర్యావరణ వేత్త డాక్టర్ సాయిభాస్కర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా భారీ వర్షాలకు కారణం, లానీనా వల్ల వచ్చి విపత్తులపై వివరించారు. అనంతరం నర్సింహా రెడ్డి, ఆర్.దిలీప్ రెడ్డి,బీవీ సుబ్బారావుతో కలిసి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్, పర్యావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల లానీనా ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో అనుకున్న దానికంటే అధిక వర్షాలు కురుస్తున్నాయనీ, ప్రస్తుతం తెలంగాణలో అదే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 శాతం వర్షాలు పడ్డాయని, మున్ముందు కూడా పడే అవకాశాలు ఉన్నాయనీ చెప్పారు. ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయని, మే చివరి వారంలో రావాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే 40 డిగ్రీలకు చేరుకుంటున్నదన్నారు. హీట్ వేవ్ అనేది ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నదని, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వెట్ బల్బ్ టెంపరేచర్ ప్రభావంతో మరింత ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. త్వరలోనే జర్నలిస్టులకు వాతావరణంలో వస్తున్న మార్పులు, విపత్తులకు కారణాలు తదితర అంశాలపై మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తామనీ ప్రకటించారు.