Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
- వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
విద్యా రంగం సమస్యలు పరిష్కరించాలని నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ కోరారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం వాల్‌పోస్టర్లను రిలీజ్ చేశారు. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత బస్‌పాస్‌లు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మన ఊరు-మన బడి పథకంలో అన్ని ప్రభుత్వ బడులను చేర్చి తక్షణమే సరిపడా నిధులు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం చేపట్టే బంద్‌లో పాల్గొనాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఎం. కిరణ్, ఎస్ఎఫ్ఐ సభ్యులు కె. చెన్నయ్య, యశ్వంత్, చరణ్, నాగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
షాపూర్‌నగర్‌లో..
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నేడు (జులై 20న) విద్యా సంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ పిలుపునిచ్చాయి. మంగళవారం మేడ్చల్ జిల్లాలోని షాపూర్‌నగర్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో బంద్ పోస్టర్‌ను ఆ సంఘాల నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు బ్యాగారి వెంకటేష్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరి హక్కు అని, దానిని అందించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. విద్యాహక్కుకోసంవిద్యార్థులు కలిసి రావాలని, బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదన్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదని, వెంటనే ప్రభుత్వం మధ్యాహ్న భోజనం మెస్ చార్జీలను పెంచి పౌష్టికాహారం విద్యార్థులందరికీ అందించాలని కోరారు. ప్రభుత్వమే విద్యార్థులందరికీ ఉచితంగ బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగం గురించి మాట్లాడుతూనే.. మరోవైపు ప్రయివేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలు అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ నేడు చేపట్టబోయే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా కమిటీ సభ్యుడు అజరు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.