Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటోన్మెంట్ అభివృద్ధి, సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం
- 'ది కంటోన్మెంట్ బిల్' ఆమోదం పొందేదెప్పుడో !
- ముందుకు సాగని అభివృద్ధి
నవతెలంగాణ-కంటోన్మెంట్
150 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. నగరంలో అంతర్భాగంగా కొనసాగుతున్నా... పాలనలో ప్రత్యేకత ఉండే కంటోన్మెంట్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడింది. కంటోన్మెంట్ ఏరియా మాత్రం కేంద్రం పరిధిలో ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ, డీమ్డ్ మున్సిపాలిటీ అంటున్న కేంద్ర ప్రభుత్వం కానీ కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. నిధులు ఇవ్వడం లేదు. నిధులతో పాటు పాలనా విషయంలోనూ తీవ్ర వివక్ష కొనసాగుతోంది. పేరుకు ప్రజా ప్రతినిధులకు బోర్డులో స్థానం కల్పించినప్పటికీ పెత్తనమంతా అధికారులదే.. సివిలియన్లపై మితిమీరిన మిలటరీ పెత్తనంతో ప్రజలు నేటికీ నలిగిపోతున్నారు. వీరికి తోడు బదిలీ బాధల్లేకుండా ఇక్కడే తిష్టవేసుకున్న బోర్డు అధికారులు మోనార్కులను తలపిస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రెండు మూడేండ్లకోసారి మారే సీఈఓలనూ పరోక్షంగా అధికారులే నియంత్రిస్తూ ఉంటారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియంతల పాలనను తలపించే కంటోన్మెంట్ బోర్డులను మరింత ప్రజాస్వామ్య బద్ధంగా తీర్చిదిద్దుతామంటూ కేంద్రం కొత్త రాగం అందుకుంది. ఈ నేపథ్యంలో 2006 నాటి చట్టంలో మార్పులు చేస్తూ నూతన బిల్లును రూపొందించింది. ఏడాది కాలంగా ఈ బిల్లుకు మోక్షమే లభించడం లేదు. ప్రతీసారి పార్లమెంట్ సమావేశాల ఎజెండాలో స్థానం కల్పిస్తున్నప్పటికీ, ఈ బిల్లు ప్రస్తావన లేకుండా సమావేశాలు ముగస్తున్నాయి. ముచ్చటగా మూడుసార్లు కంటోన్మెంట్ బిల్లుకు అవకాశమే లభించలేదు. తాజాగా నేటి నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల ఎజెండాలోనూ కంటోన్మెట్ బిల్లుకు స్థానం కల్పించారు. మొత్తం 24 బిల్లులతో పాటు కంటోన్మెంట్ బిల్లును ప్రవేశపట్టే అవకాశముందని తెలుస్తోంది.
ప్రజా ప్రతినిధులు లేరు
ఏడాదిన్నర కాలంగా కంటోన్మెంట్ పాలకమండలిలో ప్రజాప్రతినిధులే లేరు. తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా డిప్యూటీ కమాండర్, బ్రిగేడియర్ కె. సోమశంకర్, కంటోన్మెంట్ చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.అజిత్ రెడ్డిలతో పాటు సివిలియన్ నామినేటేడ్ సభ్యుడు రామకృష్ణ సభ్యులుగా కొనసాగుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 10వ తేదీన బోర్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. సాధారణంగా సభ్యుల పదవీకాలం ముగిసేలోపే నూతన పాలకమండలికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే కేంద్రం ఏడాదిన్నర కాలంగా ఎలాంటి ఎన్నికలూ నిర్వహించడం లేదు. 2006 నాటి చట్టం స్థానంలో నూతన బిల్లు రూపొందించడంవల్లే ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని కొందరు చెబుతున్నారు. అయితే ఏడాది కాలంగా ఈ బిల్లు మాత్రం పార్లమెంట్ గడప దాటడం లేదు. మరింత ప్రజాస్వామ్యయుతంగా చేయడమే లక్ష్యంగా నూతన బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, బోర్డు ప్రజా ప్రతినిధులే లేకుండా ఏడాదిన్నర కాలంగా పాలన కొనసాగిస్తుండటం గమనార్హం.
జీహెచ్ఎంసీలో విలీనంపై చర్చ
ఓ వైపు కొత్తచట్టం రూపుదాలుస్తూ ఉండగా, మరోపక్క కంటోన్మెంట్లోని సివిలియన్ ప్రాంతాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్లలో సివిలియన్ ప్రాంతాలను సమీప మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోనూ బజార్లుగా పరిగణించే 16 సివిల్ ఏరియాల్లో ఈ పాటికే సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. బోర్డు ఎన్నికలు జరుగుతాయా? లేక కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో కలిపేస్తారా? అనే చర్చ తీవ్రమైంది. ఈ విషయంలో బోర్డు ఉన్నతాధికారులతో సహా కంటోన్మెంట్ రాజకీయాల్లో కాకలు తీరిన నేతలు సైతం ఏమీ చెప్పలేకపోతున్నారు. విలీనమే ఖాయం అనుకుంటే నూతన బిల్లు ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. సరే కొత్త చట్టం అమలైతే సివిల్ ప్రాంతాలపై సర్వే ఎందుకు జరుగుతోందనే సందేహమూ ఉంది. మొత్తానికి కంటోన్మెంట్లో ఏం జరబోతోందో తెలియాలంటే ఆగస్టు రెండో వారం దాకా ఆగాల్సిందేనని తెలుస్తోంది. ఎందుకంటే ఆగస్టు 13వ తేదీతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఆ లోపే 'ది కంటోన్మెంట్ బిల్' చట్టంగా మారుతుందా లేదా అనేది తేలిపోతుంది. ప్రస్తుత వేరీడ్ బోర్డులోని సివిలియన్ మెంబర్ పదవీకాలం సైతం ఆగస్టు 10వతేదీతో ముగియనుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఎన్నికలపై క్లారిటీ వస్తుంది. అదే సమయంలో సివిలియన్ మెంబర్ పదవీకాలం పొడగింపు విషయంలోనూ స్పష్టత వస్తుంది. కంటోన్మెంట్ రాజకీయాలపై క్లారిటీ రావాలంటే మరో నెల రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.