Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
జాతీయ జెండాకు అసౌకర్యం కలిగిస్తున్న బూడిద మట్టి, అక్రమ పార్కింగులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఫీవర్ ఆసుపత్రి చౌరస్తా సమీపంలోని నిత్య జనగణమన కేంద్రం వద్ద రోడ్డుపై బైటాయించారు. లీడర్స్ ఫర్ సేవ సంస్థ అధ్యక్షుడు మల్లాడి క్రాంతి, వందే ప్రజా ప్రెసిడెంట్ శ్రీనివాస్, ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ ఆధ్యర్యంలో జరిగిన ఆందోళనలో స్థానికులు నేలంటి మధు, జూకంటి ప్రశాంత్, సర్వు అశోక్, జశ్వంత్ అలీ, నూతి శ్రీకాంత్, సాయి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నిత్యం జనగణమన జరుపుతున్న జెండా గద్దె దెబ్బతినేలా బూడిద కుప్పలు పోస్తూ, జాతీయ పతాకాన్ని ఎగుర వేయడానికి కలిగిస్తున్న ఆటంకాలను తొలగించాలంటూ నిరసన కారులు ఆందోళన నిర్వహించారు. ఐదేండ్లుగా నిత్య జనగణమన జరుగుతున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి జాతీయ జెండాను బైకు ర్యాలీ ద్వారా తెచ్చి ఇక్కడ మే 7వ తేదీన స్థాపించామని మల్లాడి క్రాంతి తెలిపారు. ఆ రోజు నుంచి నిత్య జనగణమన జరుపుతున్నామని కానీ, దానికి కొందరు ఇబ్బందులు కలిగిస్తుంటే 70 రోజులుగా సామరస్యంగా చెప్పామని, కానీ వారు నిర్లక్ష్యం వహించారని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే రోడ్డుమీదకు వచ్చి నిరసన చేస్తున్నామని చెప్పారు. ఈ బూడిద కుప్పల వల్ల స్థానికులకు చెప్పలేనన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికుడు నేలంటి మధు తెలిపారు. బోనాల శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అనీ, అధికారులు మరింత బాధ్యతగా వ్యహరించాల్సి ఉంది కానీ, వారు నిర్లక్ష్యం చూపడం తగదని అన్నారు. ఒక పక్క ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా పేరిట ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చినా ఇక్కడి అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల్లో పాల్గొన్న జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని పోలీసులు నిరసనకారుల మధ్య సంప్రదింపులు జరిపారు. ఇంటర్నేషన్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ లక్ష్మీనర్సయ్య గుప్తా చేసిన నినాదాలు ఆందోళనను హోరెత్తించాయి. ఎస్ఐ శివకుమార్, పోలీస్ సిబ్బందితో వచ్చిన నల్లకుంట సీఐ కిషన్ నిరసన కారులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ప్రజా ఏక్తా పార్టీ నాయకులు బీవీ రమేష్ నాయుడు, వై.రేణుక, జె. వినాయత, సునీతా నాయుడు, స్థానికులు పురం మాణిక్యం గుప్తా తదితరులు పాల్గొన్నారు.