Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-మెహదీపట్నం
గ్రేటర్లో పనిచేస్తున్న అర్హులైన పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు వాణి డిమాండ్ చేశారు. గురువారం జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 25 ఏండ్లుగా గ్రేటర్ పరిధిలో సుమారు 5వేల మంది పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారని, వీరిలో చాలామంది నిరుపేదలని తెలిపారు. చాలీచాలని ఆదాయాలతో పెరుగుతున్న అద్దెలను చెల్లించలేక అత్యంత దుర్భర పరిస్థితులలో జీవిస్తున్నారని వాపోయారు. పెరిగిన ధరలతో నగరంలో పేదల సొంత ఇంటి కల అందని ద్రాక్షలా మారిపోయిందని వాపోయారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సోమేశ్ కుమార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 10% పారిశుధ్య కార్మికులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ అది నేటికీ కూడా అమలు కాలేదని గుర్తు చేశారు. రాష్ట్రస్థాయిలో గ్రేటర్‌కు అనేక అవార్డులు రావడానికి కారణమైన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఇప్పటికైనా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని వేలమంది పారిశుధ్య కార్మికులతో ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంప్లాయిస్ యూనియన్ ఉపాధ్యక్షులు మల్లేష్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడలు వంచి పారిశుధ్య కార్మికులకు డబుల్ ఇండ్లు ఇప్పించేందకు పోరాటం చేస్తామని ఈ విషయంలో వెనుతిరిగేది లేదని స్పష్టం చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ ఉపాధ్యక్షురాలు యాదమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేంతవరకు పారిశుధ్య కార్మికులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కల్యాణ్, వెంకటేష్, కిరణ్, మంజుల, లక్ష్మమ్మ, శంకర్, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.