Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3కోట్ల40లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి సబితారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లో నివాసం ఉంటున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎంతో కషిచేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తూ 27, 28, 5,2 , సైఫ్ కాలనీ, 9,8, 24వ వార్డులో రూ.3 కోట్ల 40లక్షల నిధులతో చేపట్టే పలు అభివద్ధి పనులకు స్థానిక మున్సిపల్ చెర్మెన్ అబ్దుల్లా సాది, వైఎస్ చైర్మెన్ ఫర్జాన నాజ్, రీప్రజెంట్ వైఎస్ చైర్మన్ యూసుఫ్ పటేల్‌తో కలసి మంత్రి సబితాఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిమాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్, పట్టణా భివద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో జల్పల్లి మునిసిపాలిటీలో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి అనేక కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. నగర శివారు అయిన జల్పల్లి మున్సిపల్లో తాగునీటి అవసరాలతో పాటు మురుగు, వర్షపు నీరు సాఫీగా వెళ్ళటానికి కోట్లాది రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. డ్రైనేజీ పనులు, వాటర్ లైన్లు వేసిన తర్వాత రోడ్లు వేసేలా ప్రణాళిక బద్దంగా కషి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ 100 గజాల ఇల్లు ఉన్న వారికి ఉచితంగా తాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ విధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా పైపులైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి నీటి కనెక్షన్లు ఇవ్వటానికి, వాటర్ మెన్లకు వివిధ డివిజన్లు కేటాయించి ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామన్నారు. అనంతరం షాహిన్‌నగర్ కాలనీలో రూ.50లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వై.సుదర్శన్, డీఈ.వెంకన్న, షిరాజ్, ఏఈ అయేషా,కౌన్సిలర్లుఎం.డి.శంషాద్దీన్,యాహియా,అఫ్జల్, కె.లక్మినారాయణ పి.శంకర్, దస్తగిర్, రాధిక శ్రావన్, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ ఖలీఫా, మాజీ ఎంపీటిసి సభ్యులు వై.జనార్దన్, నాసర్ వలిగి, కో అప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.