Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీర్పేట్లో నకిలీ డాక్టర్‌తోపాటు మరో ఇద్దరి అరెస్ట్
- నిందితుల నుంచి పలు సంస్థలకు చెందిన నకిలీ ధ్రువీకరణ పత్రాలు స్వాధీనం
నవతెలంగాణ-హయత్‌నగర్
నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో డాక్టర్‌గా చలామణి అవుతున్న నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌తోపాటు పెద్దఎత్తున ఇతర నకిలీ సర్టిఫికెట్లు, వివిధ స్టాంప్‌లు, స్టాప్ ప్యాడ్స్, ఇతర పత్రాలు, పాస్‌పోర్టు, మూడు సెల్ఫోన్లు, కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ వివరాలను వెల్లడించారు. హుజూర్‌నగర్‌కు చెందిన కే.విజరుకుమార్ 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో కాంపౌండర్‌గా, పీఆర్ఓగా పనిచేశాడు. కారోనా సమయంలో వైద్యులకు బాగా డిమాండ్ ఏర్పడడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. వివిధ ఆస్పత్రుల్లో పనిచేసిన సమయంలో మల్లేపల్లికి చెందిన ఆఫ్రోజ్‌ఖాన్, మహమూద్ అలీ జునైద్‌తో పరిచయం ఏర్పడింది. నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ కావాలని కోరాడు. రష్యా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ పేరుతో ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇప్పిస్తామని అందుకు రూ.8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.6 లక్షల 50 వేలకు బేరం కుదుర్చుకున్నారు. అలా నకిలీ సర్టిఫికెట్ సంపాదించిన విజరు కుమార్ కొవిడ్ సమయంలో ఉప్పల్‌లోని లైఫ్ కేర్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశాడు. నెలకు రూ. 60 వేల జీతంతో 6 నెలలు పనిచేశాడు. ప్రస్తుతం మీర్ పేటలోని మంద మల్లమ్మ చౌరస్తాలో ఉన్న ఆర్.కె హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్‌గాను, ఎండీగాను పనిచేస్తున్నాడు. నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మీర్పేట్ పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ డాక్టర్‌గా గుర్తించిన ఎస్వోటీ, మీర్పేట్ పోలీసులు నిందితుడితోపాటు అతనికి సహకరించిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. నకీలీ సర్టిఫికెట్స్‌తో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎవరిపై అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, క్రైమ్ డీసీపీ మురళీధర్, వనస్థలిపురం ఏసీపీ పురోషోత్తం రెడ్డి, మీర్‌పేట ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్.ఐలు ఉదరు భాస్కర్, తకుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.