Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 10.75 సెం.మీ వర్షపాతం నమోదు
- చాదర్‌ఘాట్, సాగర్‌రింగ్ రోడ్డు, అంబర్పేట్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో మళ్లీ భారీవర్షం కురిసింది. వారం రోజుల వర్షాల తర్వాత విరామం ఇచ్చినట్టే ఇచ్చి శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. గ్రేటర్‌తోపాటు శివారుప్రాంతాల్లోనూ భారీ వర్షమే కురిసింది. ట్రాఫిక్ జామ్‌తో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. శనివారం సైతం భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాసబ్‌ట్యాంక్, కాచిగూడ, శేరిలింగంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, ఉప్పల్, బోడుప్పల్, మేడ్చల్, తుర్కయంజాల్, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీగా ట్రాఫిక్ జామ్
వర్షాల నేపథ్యంలో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్‌ఘాట్ నుంచి సాగర్ రింగ్ రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోయాయి. చంచల్‌గూడ జైల్ నుంచి సంతోష్‌నగర్ వరకు స్టీల్ బ్రిడ్జి పనుల కోసం రోడ్డును తవ్వడంతోపాటు పిల్లర్లు వేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంతోష్‌నగర్ నుంచి సాగర్‌రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదు. దీంతోపాటు అంబర్పేట్ నుంచి ఉప్పల్ వరకు, ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు ఇదే పరిస్థితి నెలకొంది.
లోతట్టు ప్రాంతాల్లో..
ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండ కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు నిలిచాయి. జగద్గిరిగుట్టలోని ఆస్బెస్టాస్ కాలనీలో రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. ముషిరాబాద్, రాంనగర్లో భారీగా నీళ్లు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్, వడ్డెర బస్తీల్లోని ఇండ్లలోని నీళ్లు చేరాయి. ఆల్వాల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కూకట్పల్లి, ఖైరతాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీళ్లు చేరాయి.
హఫీజ్‌పేట్‌లో ..
హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది. 10.75 సెం.మీ వర్షపాతం నమోదైంది. జీడిమెట్లలో 10.63 సెం.మీ, బాలానగర్ 10.45, కుత్బుల్లాపూర్ 10.25, కూకట్‌పల్లిలో 9.85, శేరిలింగంపల్లి 9.8, రాజేంద్రనగర్ 9.2, గాజులరామారం 9, హైదర్‌నగర్ 8.5 మూసాపేట్లో 8.2సెం.మీ వర్షపాతం నమోదైంది.
జీహెచ్ఎంసీ అప్రమత్తం
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజల సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పని చేసే విధంగా 3 షిఫ్ట్‌లలో పని చేసే విధంగా సిబ్బందిని నియమించారు. కంట్రోల్ రూమ్ ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మైజీహెచ్ఎంసీయాప్, టెలిఫోన్ నెంబర్ 040-21111111, ట్విట్టర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు క్షేత్రస్థాయి అధికారులు పంపించి పరిష్కారం చేస్తున్నారు. జూలై 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు వాటర్ లాగింగ్పై 1456 ఫిర్యాదులు రాగా మొత్తానికి పరిష్కరించినట్టు అధికారులు చెబుతున్నారు. వాటర్ లాగింగ్ ఫిర్యాదులే కాకుండా ఇతర సమస్యల అయిన విద్యుత్, టౌన్‌ప్లానింగ్, రోడ్లు, వాటర్‌బోర్డు, శానిటేషన్, ఆయా విభాగాల సమస్యలకు సంబంధిత అధికారులు కూడా ఫిర్యాదు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
419 కూలిన చెట్లు
ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో నగరంలో విరిగిన చెట్ల కొమ్మలు, కూలిన చెట్లు మొత్తం ఫిర్యాదులు రాగా వాటన్నింటినీ తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో గల ఈవీడీఎం విభాగంలోని 19 డీఆర్ఎఫ్ బందాల ద్వారా నగర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత ప్రదేశానికి వెళ్లి కూలిన చెట్లు, విరిగిన కొమ్మల తొలగించారు. జులై 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 419 కూలిన చెట్లను తొలగించారు. జూలై 8వ తేదీ నుంచి వారం రోజుల పాటు కురిసిన వర్షాల నేపథ్యంలో జూలై 9వ తేదీ 36, 10వ తేదీ 53, 11వ తేదీ 24, జూలై 13వ తేదీ ఒక్కరోజే 78 చెట్లు కూలినవి. జూలై 14వ తేదీ 41 చెట్లు కూలినట్లు ఫిర్యాదులు రావడం డి ఆర్ ఎఫ్ బందాలు వెళ్లి తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే పరిష్కారానికి కషి చేశారు. ఈ ఏడాది జనవరి నెల నుంచి జూన్ వరకు మొత్తం డీఆర్ఎఫ్ బందాలు 792 సహాయక చర్యలు చేపట్టాయని, అందులో 85 మందిని ఆపదలో ఉన్న వారిని డీఆర్ఎఫ్ బందాలు కాపాడాయని, 592 చెట్లు కూలిన, కొమ్మలు విరిగిన వాటిని తొలగించారని, 53 ప్రదేశాలలో వర్షపు నీటి నిల్వను తొలగించారని, 62 అగ్ని ప్రమాదాలను నివారించారని అధికారులు తెలిపారు.