Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
కేంద్ర ప్రభుత్వం పలు ఆహారపదార్థాలతో పాఠ్య పుస్తకాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి నిరుపేదల నడ్డి విరుస్తుందని నాగోలులో పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే డీిజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ధరల పెరుగుదలతో అన్ని వస్తువుల ధరల పై ప్రభావం పడి తాము కొనుగోలు శక్తిని కోల్పోతున్నట్లు వారు వాపోయారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరో వైపు కేంద్ర ప్రభుత్వం పోటాపోటీిగా తమ ఇస్టారాజ్యాంగా ధరలను పెంచుతున్నారని, దీంతో సామాన్యుడి బ్రతుకు అగమ్యగోచరంగా మారిందని, చాలీచాలని జీతాలతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియని దుర్భర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ధరల పెంపుదల తమకు తలకుమించిన భారంగా మారిందని, లేబుల్ ప్యాకేజి వస్తువులపై జీఎస్టీ అమలుపరుస్తుండటంతో లేబుల్ వస్తువులను జీఎస్టీతో కొనుగోలు చేసి పన్నుల భారం మోయాలో లేక జీఎస్టీ పన్నులు లేకుండా విక్రయించే లేబుల్ లేని ఆహారపదార్థా లను కొనుగోలు చేసి కల్తీ బారినపడి అనారోగ్యాల పాలు కావాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్లువారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని మరిచి కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చదువుకునే పుస్తకాలపై కూడా పన్నులు విధిస్తే విద్య పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందని, దీంతో నిరుపేద విద్యార్థులకు చదువుకోవాలని ఉన్నపటికీి పన్నులు చెల్లించి పుస్తకాలు కొనుగోలు చేసే స్థోమత లేక చదువులకు దూరం అయ్యే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం అవుతోంది.
పేదల ప్రభుత్వం అంటూనే పుండుమీద కారం చల్లిన్నట్లుగా ధరల మీద ధరలను పెంచుతూ మోయలేని భారాలను మొపుతూ పేద ప్రజల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నత వర్గాలకు వత్తాసు పలుకుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించే ఈ ప్రభుత్వాలు భవిష్యత్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు.