Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోడుప్పల్
''కుటుంబ బాంధ్యవాలతో పెనవేసుకుపోయిన బంధం బోనం. స్త్రీ శక్తికి ప్రతిరూపం. సంప్రదాయానికి చిహ్నం. అందుకే ఈ బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ.. ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు. తమ కుటుంబానికి, గ్రామానికి ఏ ఆపద రాకుండా రక్షించమని ప్రార్థిస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన బోనాల పండుగ ఉత్సవాలను ఆదివారం నాడు పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో భక్తులు ఉత్సాహంతో నిర్వహించుకున్నారు. శివసత్తులు శిగం ఊగంగా, పోతురాజులు నత్యం చేయంగా మహిళలు తమకు ఇష్టమైన బోనాలను అమ్మవారికి సమర్పించి తమ మొక్కులను సమర్పించుకున్నారు. ఈ బోనాల పండుగ వేడుకలలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను చూసే అమ్మవారు కరుణతో చూస్తున్నారని అన్నారు. నగరంలోని 26 డివిజన్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ డాక్టర్ రామకష్ణరావు, మేడిపల్లి సీఐ గోవర్ధనగిరిల పర్యవేక్షణలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ఉదయం నుండే బారులు తీరిన భక్తులు
పీర్జాదిగూడ నగర పరిధిలోని 26 డివిజన్ల పరిధిలో ఆదివారం నాడు బోనాల సందర్భంగా ఉదయం నుండే భక్తులు తమ బోనాలు సమర్పించేందుకు గాను బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల సదుపాయాలు కల్పించడం జరిగింది. మహిళలు చిన్న పిల్లల అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడంతో మేడిపల్లి పోలీసులు పటిష్ఠమైన రక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, సుభాష్ నాయక్, అనంతరెడ్డి, లక్మ్షి ప్రసన్న, బచ్చ రాజు, బైటింటి శారదా, బి.స్వాతిగౌడ్, పాశం శశీరేఖ, భీంరెడ్డి, నవీన్ రెడ్డి, బండి రమ్య, కుర్ర శాలిని, సమతల తదితరులు పాల్గొన్నారు.