Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతన జీఓలను వెంటనే సవరించాలి
- ఆగష్టు 3న చలో హైదరాబాద్
- హమాలీ యూనియన్ ఆఫ్ హైదరాబాద్ మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్
- గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
73 కనీస వేతన జీవోలను వెంటనే సవరించాలని, హమాలీ, ట్రాన్స్పోర్ట్, డొమెస్టిక్ వర్కర్స్ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు సాధన కోసం ఆగస్టు 3న బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్కు వరకు జరుగనున్న భారీ ప్రదర్శన, ఇందిరాపార్క్ వద్ద మహాధర్నకు హైదరాబాద్ నలుమూలల ఉన్న హమాలీ కార్మికులు, ఇతర కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.హమాలి యూనియన్ ఆఫ్ హైదరాబాద్ (సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మొదటి మహాసభ గోల్కొండ చౌరస్తాలోని సీఐటీయూ నగర కార్యాలయంలో గురువారం ఎం.సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లలో 73 కనీస వేతన జీవోలు సవరించకపోవడం, కార్మికుల జీతాలు పెంచకపోవడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారని, ప్రతి ఐదేండ్లకొకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ జీవోలు విడుదల చేయాల్సి ఉంది, కానీ టీిఆర్ఎస్ ప్రభుత్వం యజమానులకు బడాబడా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ జీతాలు పెంచకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నద న్నారు. ఒక వైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మరోవైపు ఇంటికిరాయిలు, పెట్రోల్, గ్యాస్, డీజిల్, బస్సు కిరాయిలు, విద్యుత్తు, నిత్యావసర సరుకులు ఇలా ప్రతిదీ పెరుగుతూనే పోతున్నా కార్మికుల జీతాలలో ఎలాంటి మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు అర్థాకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింద న్నారు. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులపై జీఎస్టీ విధించి పేదల నడ్డి విరిచిందన్నారు. 44 కార్మిక చట్టాలను మార్చి యజమానులకు లాభాలు చేకూర్చే విధంగా నాలుగు కోడ్లుగా మార్చిందన్నారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చింద న్నారు. కార్మికులను ఎప్పుడంటే అప్పుడు తీసివేసే స్వేచ్ఛను యజమానులకు కట్టబెట్టి భారత స్వర్ణోత్సవ వేళ కార్మిక వర్గానికి మోడీ ప్రభుత్వం ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జీతాలు, అలవెన్సులు విపరీతంగా పెంచుకున్నారని, కానీ కార్మికుల జీతాలు మాత్రం ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, నిత్యావసర సరుకులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 73 కనీస వేతన జీవోలను వెంటనే సవరించి జీతాలు పెంచుతూ జీవోలు విడుదల చేయాలని, హమాలీ రంగం కార్మికులకు, ఇంటి పని కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక
ఈ సందర్భంగా హమాలి యూనియన్ ఆఫ్ హైదరాబాద్ (సీఐటీయూ) నూతన కమిటీని 13మందితో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎం.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా శాంసన్, కోశాధికారిగా బి.మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఉపాధ్యక్షులు కె.అజరుబాబు, జి.రాములు, శ్రీనగర్ కాలనీ హమాలీ యూనియన్ నాయకులు సత్యనారాయణ, శేఖర్, రాణిగంజ్ పైప్ హమాలి నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.