Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోనల్ కమిషనర్లతో మేయర్ సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసు కోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో సెల్ కాన్ఫరెన్స్‌లో జోనల్ వారీగా చేపడుతున్న సహాయక చర్యలపై మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలన్నారు నగరంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, నాలాలో కూడా పేరుకునిపోయిన చెత్తను తొలగించాలని, మ్యాన్‌హోల్స్ వద్ద చెత్తగాని, మట్టిగాని తొలగించి సాఫీగా వరదపోయే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదుల నుండి వచ్చిన వెంటనే జాప్యం లేకుండా తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారులందరూ 24 గంటలపాటు అందుబాటు లో ఉండే విధంగా చూడాలని, ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత ప్రదేశాలకు వెళ్ళి పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎదుర్కొన్నారని, అదే స్ఫూర్తితో భవిష్యత్‌లో కూడా అంతకంటే ఎక్కువ కురిసినా ఎదుర్కునే విధంగా సిద్ధంగా ఉండాలని మేయర్ అధికారులను ఆదేశించారు. మూసీ నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని మేయర్ సూచించారు. రాబోయే 24 గంటల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు కరెంటు పోల్స్ దగ్గర, చెట్ల కింద, నాలా పరిసర ప్రాంతాల్లో నిలబడకుండా చూడాలని, ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర సమయంలో తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రజలు అత్యవసర సమస్యలుంటే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించగలరని, జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్-040-21111111, 040-29555500 లను సంప్రదించగలరని సూచించారు.