Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు
- డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ధర్నా
నవతెలంగాణ-ముషీరాబాద్
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు డిమాండ్ చేశారు. డబుల్బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ శుక్రవారం సీపీఐ(ఎం) ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్ మండల కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీజీ నర్సింహారావు మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు 15 లక్షలమంది పేదలు ఇండ్లకోసం మీసేవా సెంటర్లలో, కలెక్టర్ ఆఫీసుల వద్ద దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. ఆ దరఖాస్తులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవిగో ఇండ్లు.. అవిగో ఇండ్లు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని, ఇండ్లు నిర్మించి కేటాయించడంలో అడుగు ముందుకు పడటం లేదని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో 30 వేల ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఏ ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఇంటి అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని, మరోవైపు ధరల పెరుగుదలతో కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేదని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తే కనీసం ఇంటి కిరాయి అయినా మిగులుతుందన్న ఆశతో పేదలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సర్వే నిర్వహించి లబ్దిదారులను ఎంపికచేసి ఇండ్లు కేటాయించాలని కోరారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం కల్పించాలన్నారు. 58 జీవో కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్, ఎం.మహేందర్, ముషీరాబాద్ జోన్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, ఎ.శ్రీరాములు, కమిటీ సభ్యులు కె.రమేష్,బస్తీ వాసులు మల్లమ్మ, సుగుణ, యాదమ్మ, మణెమ్మ, శ్రీదేవి, గీత, యూసుఫ్, మచ్చెండర్, రాజు, నర్సింహ, పెద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.