Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్, సెక్యూరిటీ కార్మికులకు జీవో నెంబర్ 16 ప్రకారం రూ.15,600 వేతన ఇవ్వాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి ఎం నర్సింహ్మా డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు కార్మికులకు సక్రమంగా జీతాలు చెల్లించకుండా మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఒకవైపు అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్మికులకు రూ.15,600 వేతనం పెంచామని చెబుతున్నారని, కాంట్రాక్టర్లు మాత్రం తక్కువ వేతనం కార్మికులకు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నిబంధన ప్రకారం నాలుగు పండుగ, నాలుగు జాతీయ, 15 వరకు ఆర్జిత సెలవులు ఇవ్వాల్సి ఉండగా ఈ విషయంపై కూడా కాంట్రాక్టర్లు మాట్లాడకపోవడం అన్యాయమని అన్నారు. టెండర్ నిబంధనలు ఎవరూ పట్టించుకోవడంలేదని దీనిపై అధికారులు కాంట్రాక్టర్లఫై చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డీఎంఈ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు యాదగిరి, కోశాధికారి కిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హసీనా బేగం, నగర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మీబాయి, కింగ్ కోఠి హాస్పిటల్ పి సంతోషి, విజరు కుమార్, కోఠి మెటర్నిటీ ఆస్పత్రి జే వినోద పాల్గొన్నారు.