Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయం సంభవించే ప్రమాదం
- అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యుల వెల్లడి
నవతెలంగాణ-ఎల్బీనగర్
కాలేయానికి చేటు చేసే హెపటైటిస్ వైరస్‌లను త్వరగా గుర్తించి చికిత్స చేయించాలని, లేనిపక్షంలో వాటిలో కొన్ని ప్రాణాంతకం కావచ్చని అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ బి. శివానందరెడ్డి ఇందుకు సంబంధించిన పలు వివరాలను తెలిపారు.
హెపటైటిస్ అంటే కాలేయం దెబ్బతినడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతీ సంవత్సరం హెపటైటిస్ డేకు ఒక థీమ్ తీసుకుంటుంది. 2022కు సంబంధించిన థీమ్.. థీమ్ బ్రింగింగ్ హెపటైటిస్ కేర్ క్లోజ్ టు యూజ ప్రతీ ఒక్కరికి హెపటైటిస్‌కు సంబంధించిన చికిత్స అందాలని, అందుకు ముందుగా గుర్తించడమే ఏకైక మార్గమని డాక్టర్ శివానందరెడ్డి చెప్పారు. హెపటైటిస్‌లో ప్రధానంగా 5 రకాల వైరస్లు ఉన్నాయి. అవి ఎ.బి.సి.డి.ఇ. వీటిలో ఎ, ఇ రకాల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవు, చాలా నెమ్మదిగా ఉంటాయి, దాదాపుగా వాటంతట అవే నయమైపోతాయి కూడా. కానీ బీ, సీ మాత్రం చాలా ప్రమాదకరం. రక్తమార్పిడి, నరాలకు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం, అరక్షిత లైంగిక సంబంధాలతో ప్రధానంగా ఇవి వ్యాపిస్తాయి. తల్లి నుంచి పిల్లలకూ హెపటైటిస్ బి వస్తుంది. వీటిని త్వరగా గుర్తించి చికిత్స చేయకపోతే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది. హెపటైటిస్ సికి 10-15 ఏండ్ల క్రితం దీర్ఘకాలం పాటు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చేది. అప్పుడు కూడా 60-70 శాతం మాత్రమే నయమ్యేది. కానీ ఇప్పుడు గత ఐదారేండ్ల నుంచి కొత్త మందులు వచ్చాయి. దాంతో కేవలం నోటిద్వారా తీసుకునే మందులతోనే 95-97 శాతం నయమవుతోంది. హెపటైటిస్ బి కి కూడా మందులున్నాయి. దాంతో ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు. సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతిని, చివరకు రోగి మరణించే ప్రమాదం కూడా ఉంటుంది.
ఎవరికి పరీక్ష చేయాలి?
18 ఏండ్లు దాటిన వారందరికీ కనీసం ఒకసారి హెపటైటిస్ బి, సిల పరీక్ష చేయించాలి. ముఖ్యంగా డయాలసిస్, అవవయమార్పిడి, ఐవీ డ్రగ్స్ తీసుకునేవారిని ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పరీక్షించాలి. గర్భిణులందరికీ కూడా పరీక్ష చేయాలి. గుర్తిస్తే వెంటనే చికిత్స చేసి, తల్లి నుంచి బిడ్డకు వ్యాపించకుండా కాపాడగలం. సాధారణ రక్త పరీక్షతోనే వీటిని గుర్తించగలం. అందువల్ల దీనికి పెద్దగా డబ్బులు ఖర్చుకావు. ఉదరభాగానికి ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే కాలేయం పాడైందేమో తెలుస్తుంది. మద్యపానంవల్ల కూడా హెపటైటిస్ వస్తుంది. కొందరికి మద్యం తాగకపోయినా, ఊబకాయులకు, మధుమేహ రోగులకు కూడా హెపటైటిస్ వస్తోంది. కొలెస్టరాల్ ఉన్నవాళ్లు కూడా ఈ పరీక్షలు చేయించుకుని, ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.
ఎలా కాపాడుకోగలం?
స్టెరైల్ ఇంజెక్షన్లు, సొంత రేజర్లు, బ్లేడ్లే వాడాలి. సురక్షిత శంగారాన్నే పాటించాలి. టాటూలు సురక్షితంగా వేయించుకోవాలి. చిన్నపిల్లలకు టీకాలు వేయించాలి. ఈ ఐదు పద్ధతుల ద్వారా హెపటైటిస్ రాకుండా కాపాడుకోగలం
అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్‌లో ఉచితంగా ఫైబ్రోస్కాన్
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల మంది హెపటైటిస్ బి, సిలతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది. దీనిని గుర్తించడానికి కేవలం అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలోనే ఉచితంగా ఫైబ్రోస్కాన్ అనే అత్యాధునిక పరీక్ష చేస్తున్నారు. దీనివల్ల కాలేయం ఎంత స్టిఫ్‌గా ఉందో లేదో తెలుస్తుంది. సాధారణంగా హెపటైటిస్ బి, సిలు ఉన్నప్పుడు కాలేయం స్టిఫ్నెస్ పెరుగుతుంది. నెలకు రెండుసార్లు మాత్రమే ఈ స్కానింగ్ చేస్తారు. అనుమానం ఉన్న ఎవరైనా ఆస్పత్రికి వచ్చి, ఆయా రోజుల్లో ఈ పరీక్షను పూర్తి ఉచితంగా చేయించుకోవచ్చు. అంతేకాదు, ఈ ఆస్పత్రిలో 24 గంటలూ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, హెపటాలజిస్టులు అందుబాటులో ఉంటారు. వీళ్లు మీ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి, ఎలా చికిత్స చేయాలో చెబుతారు. కార్యక్రమంలో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ భూపతి రాజేంద్రప్రసాద్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డాక్టర్ శివకుమార్ రెడ్డి, ఆస్పత్రి సీఓఓ డాక్టర్ సత్యేందర్ సింగ్ సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.