Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు మల్లేష్, గోపాస్ కిరణ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాటం ఆగదు అని సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు మల్లేష్, గోపాస్ కిరణ్ అన్నారు. సీఐటీయూ ఖైరతాబాద్ జోన్ రెండవ మహాసభ మింట్ కాంపౌండ్‌లో సోమవారం జరిగింది. ఈ మహాసభకు హాజరైన సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు మల్లేష్, గోపాస్ కిరణ్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా చేయటం వల్ల కార్మిక హక్కులు కోల్పోయన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనీ ఎద్దేవా చేశారు. ఒకవైపు చమురు ధరలు పెంచుకుంటూ మరోవైపు జీఎస్టీ పేరుతో విపరీతమైన పన్నులు వేస్తూ ప్రభుత్వ సంస్థల వనరులను అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వంటగ్యాస్, నిత్యావసర ధరలు పెంచటం వల్ల బ్రతుకు భారమైన అడ్డా కూలీలకు కనీసం కూడా పని దొరకటం లేదన్నారు. సెక్యూరిటీ గార్డ్స్, హౌస్ కీపింగ్ వర్కర్స్, హాస్పిటల్స్‌లో పని చేసే కార్మికులకు, పార్కులలో పనిచేసే కూలీలకు జీతాలు పెరగకపోవటంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిస్వార్థంగా సర్వే చేసి అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. అనంతరం మొత్తం 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీఐటీయూ ఖైరతాబాద్ జోన్ కన్వీనర్‌గా పి శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో ఐద్వా ఖైరతాబాద్ జోన్ కార్యదర్శి కె రాధిక, హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు బి మాధవి పాల్గొన్నారు.