Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
'రెవెన్యూ వ్యవస్థ తెలంగాణకు ఆయువు పట్టు. వీఆర్ఓ లను తొలగించి 22 నెలలు అయ్యిందని, ఎందుకు తొలగించారో ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పలేదు. (సీసీఎల్ ఏ) కమిషనర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, రెవెన్యూ మంత్రి లేకుండా తమ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారు. కొత్త మండలాలు, కొత్త జిల్లాలు పెంచారు. కానీ ఒక్క కొత్త పోస్టు కూడా అమలు చేయకపోగా వీఆర్వోల 7 వేల నియమకాలను రద్దు చేశారు' అని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్లో స్టేషన్లో ఉండేది రెవెన్యూ సిబ్బంది అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతి పోలింగ్ స్టేషన్లో చెపుతామనీ, ధరణిలో జరుగుతున్న అక్రమాలను త్వరలోనే తాము భయట పెడతామనీ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ లేనిపక్షంలో తమ కార్యచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. రెవెన్యు డిపార్ట్మంట్ మీద ఎందుకు కక్ష కట్టారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధరణిలో వచ్చిన సమస్యలపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడడంలేదో సమాధానం ఇవ్వాలన్నారు. 121 జీవో రద్దు చేయకపోతే ప్రజల్లోకి తమ సమస్యను తీసుకు వెళతామనీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ధరణినీ ఒక ప్రయివేట్ కంపెనీ నడుపుతుందనీ విమర్శించారు. రెవెన్యూ శాఖలో ఉన్న ఖాళీలను నింపాలనీ కోరుతూ వీఆర్వోలను దొంగలుగా చిత్రీకరించి వేరే శాఖలోకి పంపివేసి ఆ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 121 జీవోను వెనక్కి తీసుకోవాలని, వీఆర్వోలకు పే స్కేల్ అమలు చేయాలని, లేకపోతే నిరవధిక సమ్మె వెళ్తామని ప్రకటించారు. సమవేశంలో గౌరవ అధ్యక్షులు సతీష్, నరేష్, ప్రతిభ, సత్యనారాయణ రెడ్డి, నరసింహారెడ్డి శ్రవణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.