Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న ఢిల్లీ జంతర్-మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు మాదిగ స్టూడెంట్ యూనియన్ (ఎంఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ తెలిపారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరించాలని కోరారు. 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణను చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు వర్గీకరణ చేయకపోవడం విడ్డురంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న ఢిల్లీలోని జంతర్-మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఎస్యూ రాష్ట్ర నాయకులు అశోక్, మనోహర్, దశరథ్, కొండల్, మహేష్, నరేష్, సందీప్, స్వామి, గణేష్, ఓయూ అధ్యక్షుడు బొర్రా శాంతి కుమార్ పాల్గొన్నారు.