Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులు మారన్న
నవతెలంగాణ-మెహిదీపట్నం/జూబ్లీహిల్స్
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు కేటాయించాలని, లేకపోతే పేదలతో కలిసి వాటిని ఆక్రమించుకుంటాం అని సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులు మారన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) నాంపల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర శివారులలో నిర్మించిన 70 వేల ఇండ్లను ఇప్పటికీ పేదలకు కేటాయించకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తుందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే పేదలతో కలిసి ఆ ఇండ్లను ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆసిఫ్ నగర్ పరిధిలో ఆన్లైన్ ద్వారా 37,691 మంది నేరుగా, మండల, కలెక్టర్ కార్యాలయం ద్వారా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి డబుల్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం ఇవ్వాలని, స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేద వారికోసం ప్రభుత్వం పది లక్షల రూపాయల సహాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ షేక్ ఫరీన్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర సభ్యులు వెంకటేష్, జోన్ కన్వీనర్ మల్లేష్ నాయకులు శంకర్, వెంకటస్వామి, యాదయ్య, రజియా, నగేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ జోన్ ఆధ్వర్యంలో
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) నాయకులు సాయి శేషగిరిరావు, ఆర్ అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం ఖైరతాబాద్ ఎమ్మార్వో అన్వర్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని బస్తీలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వేలాదిమంది మీ సేవలో, ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీసులకు వెళ్లి అర్జీలు పెట్టుకున్నారన్నారు. దరఖాస్తు పత్రాలను పరిశీలించి వెంటనే అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. రహమత్ నగర్ డివిజన్ కమలానగర్ బస్తీలో, ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని రేకుల గదులు నిర్మించుకొని కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న సుమారు 200 కుటుంబాలను డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వారి మాటలు నమ్మి ఇండ్లు ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయిన 200 కుటుంబాలు చెల్లాచెదురుగా, సమీపంలోని బస్తీలలో చిన్నపాటి ఇండ్లను కిరాయికి తీసుకొని జీవిస్తున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. అయితే ఆరేండ్లయినా అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తికాలేదన్నారు. ఇండ్ల కిరాయిలు కట్టలేక అనేక బాధలు పడుతున్నామని నాయకులకు, అధికారులకు అక్కడి బాధితులు మొరపెట్టుకున్నారని వాపోయారు. ఇప్పటికైన అధికారులు స్పందించి అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.