Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుర్గంధం వెదజల్లుతున్న బస్తీ
- పందులు, కుక్కలకు ఆవాసం
- ప్రజాప్రతినిధులకు పట్టని వైనం
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లోని నాంచారమ్మ బస్తీ వద్ద డబుల్ బెడ్రూం కాలనీ సమీపంలో నెలకొన్న చెత్త కుప్పల కంపు ఎవరికీ పట్టదా అంటూ కాలనీవాసులు వాపోతున్నారు.
పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిన ప్రభుత్వం వారు నివాసం ఉంటున్న పరిసరాల పరిశుభ్రత పట్ల మాత్రం తమకు సంబంధం లేన్నట్లు వ్యవహరిస్తోంది. మన్సురాబాద్ నుండి బండ్లగూడ వెళ్ళే దారిలో నాంచారమ్మ బస్తీ సమీపంలోని పరిసర కాలనీలవాసులు తమ ఇండ్లలో సమకూరిన చెత్త చెదారాంతోపాటు మిగిలిపోయిన ఆహార పదార్థాలను సైతం బస్తీకి సమీపంలో వేయడంతో అవి మురిగిపోయి దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా చెత్తతోపాటు మిగిలిపోయిన ఆహార పదార్థాలను పారవేయడంతో వాటి కోసం కుక్కలు, పందులు చేరి వాటిని చెల్లాచెదురు చేసి రోడ్డంతా చేస్తున్నాయి. దీంతో దుర్వాసన భరించలేని విధంగా ఉందని అంటున్నారు. ఒక వైపు వర్షాలు కురుస్తుండడంతో నీరు నిలిచి పందులు చేరి వాటిలో పొర్లుతూ గుంతలను ఏర్పరుస్తున్నాయని, దీంతో ఈగలు, దోమల బెడద పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోడ్డుగుండా ఎంతో మంది అధికారులు, ప్రజాప్రతినిధులు తిరుగుతున్నా ఇంత వరకూ ఈ కంపును పట్టించుకున్నవారే లేకపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఒక వైపు డ్రైనేజీ, మరో వైపు ఈ చెత్త సమస్య వల్ల ఈగలు, దోమలు పెరిగిపోయి మలేరియా, డెంగు, మెదడువాపు, అతిసార లాంటి తదితర రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కంపుపై దష్టిసారించి ఇక్కడ చెత్త వేయకుండా కేవలం ఇంటి వద్దకు వచ్చే వాహనాల్లో వేసే విధంగా చర్యలు చేపట్టాలని బస్తీవాసులు కోరుతున్నారు. చెత్తను వేస్తున్న ప్రాంతంలో మురికి కందకాలు లేకుండా మట్టిని తోలి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి తమ ఆరోగ్యాలను కాపాడాలని నాంచారమ్మ బస్తీవాసులు కోరుతున్నారు.