Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం
- జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం వందలాది మంది కార్యకర్తలతో కలిసి పార్లమెంట్ భవనం ముట్టడికి బయలుదేరిన బీసీ నాయకులను ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బారికేడులు పెట్టి పోలీసులు నియంత్రించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ఆర్ కష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే దేశంలో తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. స్వాతంత్రం లభించి 74 ఏండ్లు గడిచిన బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడం లేదని విమర్శించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి అభివద్ధికి ప్రత్యేక స్కీముల రూపొందించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ను తొలగించాలన్నారు. కేంద్ర విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను బీసీలకు జనాభా ప్రకారం 27% నుంచి 56% పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకు రావాలని సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు యాదవ్, మహిళా సంఘం అధ్యక్షులు ఎనగాల నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు.