Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రుల మహమూద్ అలీ, తలసాని
నవతెలంగాణ-బంజారాహిల్స్
కమాండ్ కంట్రోల్ రూమ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లో చేపడుతున్న కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులను డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ గుప్తా, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత లతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో సుమారు రూ.600 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈనెల 4న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుందని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్న కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించవచ్చు అని తెలిపారు. డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాల నుంచి కూడా శాంతిభద్రతలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో కమాండ్ కంట్రోల్ మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయం కానున్నదని చెప్పారు. కార్యక్రమంలో క్రైమ్ ఎస్ఓటీ అడిషనల్ డైరెక్టర్ ఏ ఆర్ శ్రీనివాస్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిల్స్, బంజారాహిల్స్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.