Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల అలసత్వంతో కార్మికులకు తిప్పలు
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. మీనా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.మీనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దంత వైద్యశాలలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్, పేషంట్ కేర్ సెక్యూరిటీ, ధోబి కార్మికులకు వేతనాలు పెంచకపోవడం వల్ల దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కనీస వేతనాలు అమలు చేస్తూ జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తీసివేయకుండా అన్ని ఆస్పత్రుల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని, సెలవులు మంజూరు చేయాలని, యూనిఫార్మ్స్, రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో రోజూవారీగా ఎదురవుతున్న సమస్యలను, ఇబ్బందులను డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల అనుగుణంగా వేతనాలను పెంచి, డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకొని ప్రతి నెలా జీతాలు చెల్లించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటాలకు సిద్ధమవుతామని ఆమె హెచ్చరించారు.