Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లో పలు కాలనీలవాసులు చెత్తను వీధుల్లో ఎక్కడపడితే అక్కడ వేయడంతో కుప్పలు తిప్పలుగా పేరుకు పోతుందని, దీంతో తమకు తిప్పలు తప్పడం లేదని ఆయా కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్లోని శుభం ఫంక్షన్ నుండి జైపూర్ వెళ్లే దారిలో మరియు బండ్లగూడ చౌరస్తా నుండి జైపూర్ కాలనీకి వెళ్లే దారిలో వీటితోపాటు పలు కాలనీలలోని కొందరు ఇంట్లో గల తడి పొడి చెత్తను వారితోపాటు కొంత మంది కూరగాయల వ్యాపారస్తులు కుళ్ళిపోయిన కూరగాయలను కుప్పలు తిప్పలుగా ఎక్కడపడితే అక్కడ పారవెయడం పరిపాటిగా మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ను సేకరించడానికి ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటోలు వస్తున్నప్పటికీ వాటిలో వేయకుండా కాలనీ రోడ్లపై రాత్రి వేళలో సంచుల్లో తీసుకెళ్లి వేస్తున్నారనే ఆరోపణ వినిపిస్తున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన చెత్త ను ఎప్పటికప్పుడు తరలించడానికి సంబంధిత సిబ్బంది వినాయక నిమజ్జన కార్యక్రమంలో నిమగం కావడంతో కాలనీలో చెత్త పేరుకుపోయిందని పలువురు అంటున్నారు.ఒకవైపు వర్షాలు కురుస్థూండడం తో పేరుకుపోయిన చెత్త కుప్పలు తడిసి మురిగి తీవ్రమైన దుర్గంధం దుర్వాసన వెధజల్లుథూంధని అంతే కాకుండా కుక్కలు, పందులు అక్కడికి చేరి చెల్లాచెదురుగా చేస్తూ రోడ్లపైకి థీసుకొస్థున్నాయి. దీంతో పలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డివిజన్లో దోమలు బెడద పెరిగి ఎంతో మంది డెంగ్యూ బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాలనీవాసులు కూడా ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పార వేయకుండా ఇంటిముందుకు వచ్చే స్వచ్ఛ ఆటోలలో వెయ్యాలని అప్పుడే మన ఇల్లు మన కాలనీ మన ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుందని మనం కూడా ఆరోగ్యంగా ఉంటామనేది ప్రతి ఒక్కరిలో ఉండాలని డివిజన్లోని పలువురు కోరుతున్నారు.