Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓయూ హాస్టళ్లలోని మెస్‌లలో, పలు విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమలు కాని కనీస వేతనాలు అందనంత దూరంలో ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు, కార్మిక నిబంధనలకు తూట్లు ఇప్పటికీ కట్టెల పొయ్యిమీదే వంట కుక్, కేర్ టేకర్స్, వార్డుబార్సు, వార్డు ఉమెన్స్ తదితర కార్మికులు,ఉద్యోగుల ఇబ్బందులు పట్టించుకోని ఓయూ అధికారులు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచడం వెనుక అనేక అంశాలతోపాటు ఇక్కడ పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల శ్రమ, నైపుణ్యాలు కూడా దాగున్నాయి. కానీ నేడు వారికి కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు మాత్రం అమలు కావడంలేదు. ఏండ్ల తరబడిగా పనిచేస్తున్నపటికీ చాలీ చాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారు. కుటుంబ పోషణ భారమై అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతున్నారు.
ఓయూలో హాస్టళ్లలోని మెస్‌లలో కుక్స్, ఎడ్ యేటర్స్, కేర్ టేకర్స్, కామాటిస్, వార్డ్ ఉమెన్, వార్డ్ బారు, మెట్, కిచెన్ మెట్, ఇలా వివిధ రూపాల్లో సుమారు 382మంది పనిచేస్తున్నారు. ఏండ్ల తరబడిగా పనిచేస్తున్నప్పటికీ వీరిని రెగ్యులరైజ్ చేయలేదు. ఏదో ఒకరోజు తమను రెగ్యులరైజ్ చేస్తారని, వేతనాలు పెంచు తారనే ఆశతో వీరు పనిచేస్తున్నారు. కనీస వేతనాలు, సౌకర్యాలు లేకున్నా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. అయినా సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంలేదు. కనీస వేతనాలు, సమాన వేతనాలు అమలు చేయకుండా ఔట్ సోర్సింగ్ కిందనే కొనసాగిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరా స్తున్నారని ఓయూ ఔట్సోర్సింగ్ కార్మికులు వాపోతున్నారు.
అందరూ నిరుపేదలే...
ఉస్మానియా వర్సిటీ పరిధిలోని హాస్టల్స్‌లలో, మెస్‌లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవారే. 26 ఏండ్ల కిందట నూకలకోసం, ఆకలి తీర్చుకోవడానికి అన్నం కోసం, కూరలు దొరికితే చాలు అని కొందరు ఇక్కడ పనిచేసేందుకు చేరిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ వారి బతుకుల్లో మార్పులేదు. వెట్టిచారికి నుంచి విముక్తి లేదు. శ్రమకు తగిన వేతనం లేకపోయినా కనీస వేతనం అమలు చేసినా ఈ నిరుపేదల బతుకులు కొంచెం బాగుపడతాయి. కానీ ఓయూ అధికారులు ఇక్కడి ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు గతంలో చీఫ్ వార్డెన్ కార్యాలయం నుంచి వేతనాలు చెల్లించారు. ప్రస్తుతానికి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నారు. నిర్వహణ బాధ్యత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వడంతో కనీస వేతనాలు, కనీస హక్కులకు అవకాశం లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కట్టెల పొయ్యితో కన్నీళ్లు...
నిత్యం వివిధ సందర్భాల్లో గొప్పలు చెప్పుకుంటున్న ఓయూ పాలకులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు మాత్రం న్యాయం చేయడంలేదు. ఇప్పటికీ నిజాం కాలంనాటి వంటశాలలు ఉన్నాయి. వాటిలో తగిన విధంగా సౌకర్యాలు కల్పించడంలేదు. ఇప్పటికీ హాస్టల్ మెస్‌లలో కట్టెపొయ్యి పైన వంట చేస్తుండటంతో వంటచేసే కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ, దుమ్ము, ధూళితో కంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు వీరిని వెంటాడుతున్నాతున్నాయి. ఒకప్పుడు బతుకుదెరువుకోసం నూకలు వస్తే చాలు అనుకొని మెస్‌లలో వంట మనుషులుగా, తదితర పనులలో చేరిన కార్మికులు ఏండ్ల తరబడి ఇక్కడే సేవలు అందిస్తూ వస్తున్నారు. రూ.100 వేతనం నుంచి నేడు సీనియారిటీ ప్రకారం రూ.12వేల నుంచి రూ.16వేల వరకు వేతనాలు పొందుతున్నారు. మారిన పరిస్థితుల్లో ఇది కనీస వేతనం కూడా కాదు, ఈరోజుల్లో బతకడానికి ఏమాత్రం సరిపోదు. అందుకే కనీస వేతనాలు, సమాన వేతనాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఇక ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికు పరిస్థితి దయనీయంగా ఉంది. రూ. 5వేల నుంచి 6వేల వేతనం ఇచ్చి వీరితో వెట్టిచాకిరీ చేయించుకున్నారు.
ఈఎస్ఐ, పీఎఫ్ అసలే లేవు
కనీస వేతనాలే కాదు, ఏండ్ల తరబడిగా పనిచేస్తున్నా కూడా ఎంప్లాయి స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ, కార్మిక భద్రత బీమా పథకం), ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వంటి కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించిన పథకాలు కూడా ఓయూలో అమలు చేయకపోవడం శోచనీయం. విద్యా సంస్థల్లో కూడా ఈఎస్ఐ, పీఎఫ్ తప్పనిసరిగా అమలు చేయాలని 2008లో ప్రభుత్వం జీవో తెచ్చినప్పటికీ దానిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు అమలు చేయడం లేదు. ఓయూ అధికారులు కూడా పట్టించు కోవడం లేదు. ఫలితంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు అవస్థలు పడాల్సి వస్తోంది.
భద్రత లేని బతుకులు
ఓయూలో ఏండ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ ఔట్సోర్సింగ్ అయినందున తమకు ఏ విధమైన భద్రత లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు. ఓయూ అధికారులు స్వయంగా నిర్వహణలోకి తీసుకుని కనీస వేతనాలు అమలు చేస్తేనైనా తమకు మేలు జరిగేదని, క్రమంగా రెగ్యులరైజ్ చేసినా ఇబ్బంది ఉండేది కాదని చెప్తున్నారు. కానీ అలా చేయకుండా ఔట్సోర్సింగ్ ఏజెన్సీ కింద తాము పనిచేస్తుండటంవల్ల హక్కులు, భద్రత లేకుండా పోయాయి అంటున్నారు. ఇప్పటి వరకు ఓయూలో పనిచేస్తున్న వారిలో పలువురు వివిధ కారణాలవల్ల మృత్యువాత పడిన సంఘటనలు, సందర్భాలు ఉన్నాయి.
- వర్సిటీలోని చెట్టు మీద నుండి పడి, పరీక్ష విభాగానికి చెందిన కాంట్రాక్టు ఉద్యోగి వెంకటయ్య మృతి చెందాడు.
- మంజీర మెస్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కె.కవిత ఆగస్టు 10న విషపురుగు కాటుకు గురై మృతి చెందింది.
- ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సెంటినరి హాస్టల్లో పనిచేస్తున్న కుక్ ఈ.వెంకటేష్ మే10వ తేదీని గుండెపోటుతో మృతి చెందాడు.
- మలైకా సెంటినరి హాస్టల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కుక్ విధుల్లో ఉండగాగానే జూన్ 13న గుండెపోటుతో మృతి చెందాడు.
ఓయూ టెండర్లో పేర్కొనలేదు
ఔట్ సోర్సింగ్ కార్మికులకు మేము పీఎఫ్, ఈఎస్ఐ వంటివి చెల్లించడం లేదు. ఎందుకంటే ఓయూ టెండర్లో ఆ విధమైన నిబంధనలు పేర్కొనలేదు.
- శ్రీధర్, సుమతి, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రతినిధి
కాంట్రాక్టు, టైమ్ స్కెల్ ఉద్యోగులదీ అదే పరిస్థితి
ఓయూలో 30 ఏండ్ల నుంచి పనిచేస్తు న్నప్పటికీ ఔట్ సోర్సిం గ్, కాంట్రాక్టు కార్మికులకు, టైమ్ స్కేల్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. సామాజిక, ఆరోగ్య భద్రతను, కార్మికుల హక్కులను ఓయూ అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోడం లేదు. పీఎఫ్, ఈఎస్ఐ వంటివి ఓయూలో అమలు చేయకుండా యాజమాన్యం, ఏజెన్సీలు కాలయాపన చేయడం సిగ్గుచేటు. కార్మిక బీమా పథకం 1948 చట్టం ప్రకారం, అది కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. పౌల్ట్రి, వ్యవసాయరంగం తప్ప అన్ని రంగాల్లోనూ 10 మందికంటే ఎక్కువగా పనిచేస్తుంటే, ఈ కార్మికులకు ఈఎస్ఐ అమలు చేయాలని చట్టం చెబుతోంది. కానీ యాజమాన్యాలు అలా చేయకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి. ఈపీఎఫ్ అనేది భారత రాజ్యాంగం 1952 చట్టం ప్రకారం కార్మికులకు కల్పించిన హక్కు అది కూడా అమలుకు నోచుకోవడంలేదు. ఇప్పటికైనా ఓయూలో కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలి. అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
- టి.మహేందర్,
సికింద్రాబాద్ సీఐటీయూ కార్యదర్శి