Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల్లేక భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు
- వరుస వర్షాలతో ఆగిన నిర్మాణాలు
- పస్తులుంటున్న దినసరి కూలీలు
నవతెలంగాణ-బాలానగర్
రెక్కాడితే గానీ డొక్కాడని అడ్డా కూలీలు, వలస కార్మికుల జీవితాలు వర్షాల కారణంగా ఛిద్రమైపోతున్నాయి. రోజూవారీ కూలిపనులతో పొట్టనింపుకునే వారి బతుకులు వర్షాల ముసురుతో గంజినీళ్లు కూడా తాగలేని దుస్థితికి చేరుకున్నాయి. ఇంటికే పరిమితం కావడం వల్ల రోజు కూలీ దొరకడమే గగనమైన తరుణంలో ఏ పనులు లేకపోవడంతో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది వారి పరిస్థితి. అటు కూలీ దొరక్క, ఇటు కుటుంబాన్ని పోషించుకోలేక అగచాట్లు ఎదుర్కొంటున్నారు. పొద్దంతా కష్టపడితే అంతో ఇంతో వచ్చేదనీ, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అడ్డాల పైన భవన నిర్మాణ కార్మికులు అల్లాడి పోతున్నారు. ఇటీవల నిత్యం వర్షాల కారణంగా నిర్మాణ పనులు నిలిచి పోవడంతో ఇతరత్రా పనుల కోసం అడ్డాలపై కూలీలు పడిగాపులు కాస్తున్నారు. సాధారణ రోజుల్లోనే వారి బతుకులు అంతంత మాత్రమే.. కండ్లలో ఆశలు.. కడుపులో ఆకలితో బతుకు తెరువు కోసం దినసరి కూలీలు రోడ్లపై తాత్కాలిక అడ్డాల్లో ఎండకు ఎండుతూ, వర్షాలకు తడుస్తూ, చలికి వణుకతూ కష్టజీవులు ఆకలికేకలతో అల్లాడుతూ అవస్థలు పడుతున్నారు.
ఒడిస్సా, బీహార్, బెంగాల్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచేగాక మహబూబ్నగర్, మెదక్, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, నల్లగొండ తదితర జిల్లాల నుంచి వలస వచ్చి లక్షలాదిమంది కూలీలు నగర నలుమూలల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుని దినసరి కూలీలుగా జీవన పోరాటం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాల తో వారి జనజీవనం స్తంభించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏ రోజుకారోజు వచ్చే కూలి డబ్బులపై ఆధారపడి బతికే కూలీలకు పనుల్లేక పస్తుండాల్సిన పరిస్థితి నెలకొంది. వీరంతా 5 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారాలు చేస్తూ, కుటుంబాలను పోషించుకునే వారికీ గిరాకీ లేక విలవిల్లాడుతున్నారు. 20, 30 ఏండ్లలో ఎన్నడూ ఇలా ఇన్ని రోజులు ముసురు పటడం చూడలేదంటున్నారు.
ఇండ్లకే పరిమితమైన లక్షలాది కుటుంబాలు
కొద్ధిరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావడం లేదు. చిన్న పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు ఇండ్లకే పరిమితమయ్యా రు. నిర్మాణ పనులు నిలిచిపోవడం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, కూలీలు ఉపాధికి దూరమ య్యారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చిన లక్షలాది మంది కూలీలకు పనిలేక అల్లాడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో జనం పెద్దగా బయటికి రాకపోవడంతో రోడ్లు బోసిపో యి కనిపిస్తున్నాయి. రోడ్ల వెంట పూలు, పండ్లు, టీ, టిఫిన్, జ్యూస్ అమ్ముకునే వ్యాపారులకు గిరాకీ లేకుండా పోయింది. భారీ వర్షాలతో రాజధాని పరిసర ప్రాంతాల్లో లక్షల మందికి ఉపాధి కరవైంది. వివిధ పరిశ్రమలతోపాటు మిగిలిన రంగాల్లో దాదాపు 30 లక్షల కార్మికులు పని చేస్తుంటారని అంచనా. వీరిలో చాలా మంది రోజువారీ వేతనం మీదే జీవనం సాగిస్తున్నారు. నిర్మాణ రంగంలో పని చేస్తున్న 5 లక్షల మంది కార్మికులకు పనిలేకపో వడంతో నాలుగైదు రోజులుగా ఇండ్ల దగ్గరే ఉండాల్సి వస్తోంది. చిన్నపరిశ్రమలు ఇతరత్రా వాటిలో పని చేసే లక్షలమంది కార్మికులపై కూడా వాన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ముసురు చిరు వ్యాపారులనూ ఇబ్బంది పెట్టింది.
4 లక్షల మంది చిరు వ్యాపారులు..
బల్దియా అధికారుల లెక్కల ప్రకారం 4 లక్షల మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరంతా రోడ్ల పక్కనే ఏదో ఒక వ్యాపారాలు చేస్తుంటారు. నాలుగు రోజులుగా చాలా రోడ్లు ఖాళీగా దర్శనమి స్తున్నాయి. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరి కలు జారీ చేయడంతో ప్రజలు ఇండ్ల నుంచి కాలు బయట పెట్ట లేని పరిస్థితి నెలకొంది. దీంతో కూలీ పనులకు వెళ్లేవారు, చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక కుటుంబపోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో పేద, మధ్య తరగతి కుటుం బాల వారు అల్లాడుతున్నారు. ఇప్పటికే అప్పుల భారంతో సతమత మవుతున్న పేద కుటుంబాలు విద్య, వైద్యం, అత్యవసర పనులకు అప్పులు చేసిన ప్రజలు ప్రస్తుతం పూటగడవడానికే అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులు చేస్తూ ఇండ్లు గడుపుకుంటున్నారు. పనులు లేకపోవడం తో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న రూ.5 అన్నపూర్ణ భోజనం తిని మరోపూట పస్తులతో కాలం గడుపుతుండటం గమనార్హం.
వెల్ఫేర్ బోర్డు నుంచి ఆదుకోవాలి
నగరంలో వర్షాల కారణంగా పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతు న్నారు. ఇతరత్రా పనులు కూడా దొరక్కపో వడంతో వారి కుటుంబాలు జీవనోపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. దిక్కు తోచని దినసరి కూలీల వారి కుటుంబాల్లో పిల్లలను చదివించుకోలేక, ఇంటి కిరాయిలు చెల్లించలేక, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పండుగ, పబ్బాలకు ఏం కొనలేక, ఏం తినలేక పచ్చ డి మెతుకులతో కాలం గడుపుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెల్ఫేర్ బోర్డులో నుంచి డబ్బును ఇతరవాటికి మళ్లించకుండా ఈ వర్షాకాలంలో పని లేకుండా ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను వెల్ఫేర్ బోర్డు నుంచి ఆదుకోవాలి.
- ఐలాపురం రాజశేఖర్, సీఐటీయూ బాలానగర్ మండల కార్యదర్శి