Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
నాలుగు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీవర్షాలకు రోడ్లు కొట్టుకు పోయి గుంతలుగా మారడంతో వాహనచోదులు, కాలినడకదారులకు బయటికి రావాలంటే నరకయాతన అనుభవించే పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క వాటర్ బోర్డ్ అధికారులు మ్యాన్‌హోల్ మూతలు తీయద్దని హెచ్చరి కలు జారీ చేస్తుంటే.. కొందరు మ్యాన్‌హోల్ మూతలు తీసేసి వాహన చోదకుల కాలినడకన వెళ్లే వారి ప్రాణాలకు అపాయం కలిగించేలా వ్యవహ రిస్తున్నారు. ఇటువంటి వారిపై ఇంతవరకు వాటర్ బోర్డు అధికారులు గానీ జీహెచ్ఎంసీ అధికారులు గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం అధికారులు, పాలకులు ఒకసారైనా బస్తీల్లో ప్రధాన రహదారులపై ప్రవహిస్తున్న మురికి నీరు పొంగుతున్న మ్యాన్‌హోళ్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఇటీవల బంజారాహిల్స్‌లోని శ్రీనగర్ కాలనీలో భారీ వర్షం కారణంగా వాహన చోదకుడు అదుపుతప్పి పడిపోయిన సంఘ టన కూడా చోటుచేసుకుంది. సిబ్బంది కొరత, కాంట్రాక్టర్ల అలసత్వంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు రహదారులపై కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు రహదారులపై ఇసుకమేటలు దర్శనమిస్తున్నాయి. కాలనీ అపార్ట్మెంట్ వాసులు వాటర్ బోర్డ్ అధికారులకు ఫోన్లు చేస్తే స్పందించేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3, ఎన్బీటీ నగర్, ఫిలింనగర్, వెంకటేశ్వర కాలనీ సింగాడ కుంట, నూర్ నగర్ ప్రాంతాల్లో మురికిపేరుకుపోడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరుణదేవుడు కరుణిస్తున్న అధికారులు, పాలకులు కరుణించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.