Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో రెండు రోజుల పాటు వర్షాలు
- మొత్తం 94 ప్రాంతాల్లో కురిసిన వర్షం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ను వర్షం ముసురు ఇప్పట్లో వీడేలా లేదు. మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రెెండో రోజులపాటు 28 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 22 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఆదివారం గరిష్టంగా 28.2 డిగ్రీలు, కనిష్టంగా 21.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలో గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న చిరుజల్లులతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని కంటిన్యూగా నగరమంతటా ముసురు కమ్ముకుంది సండే సెలవు కావడంతో ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా.. ఆయా పనుల నిమిత్తం బయటకు వచ్చిన పాదచారులు, వాహనదారులు చిరుజల్లులకు తడిసిముద్దయ్యారు. గ్యాప్ లేకుండా పడుతున్న జల్లులకు రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కనిపించింది. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 94 ప్రాంతాల్లో వర్షం పడగా.. శేరిలింగంపల్లిలో 7.0 మిల్లీ మీటర్లు, కాప్రా సర్కిల్లో 6.0 మీ.మీ, ఉప్పల్ 5.8 మీ.మీ, మల్కాజ్గిరి 5.5మీ.మీ, అల్వాల్ 5.3మీ.మీ వర్షపాతం నమోదైంది. మరో రెండురోజుల వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించారు.
నాలుగో రోజూ కొనసాగుతున్న ఔట్ ఫ్లో
ఉస్మాన్ సాగర్‌కు ఇన్ ఫ్లో పెరగడంతో ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ప్రస్తుతం 2,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 2,652 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతుంది. అదేవిధంగా హిమాయాత్ సాగర్ ఇన్ ఫ్లో 600 క్యూసెక్కులు కాగా, 678 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా, రెండు గేట్లను ఎత్తి నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1,789.40 అడుగులు, హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,762.20 అడుగులుగా ఉంది.