Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
- మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు
- పాల్గొన్న విద్యార్థులు, అధికారులు
నగరవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్, మంత్రులు, మేయర్, ఎమ్మెల్యే ఆధ్వర్యలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మీర్పేట్, అంబర్‌పేట, గోషామహల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కుల, మతాలకతీతంగా నైజాం నిరంకుశ పాలనకు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం వల్లనే సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని వారు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమోరు కుమార్, డిప్యూటీ కలెక్టర్ సంతోషిని పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రులు తలసాని యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం సెప్టెంబర్ 17నే వచ్చిందని, అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మన్నె కవిత రెడ్డి, సంగీత శ్రీనివాస్ యాదవ్, వెల్దండి వెంకటేష్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీఎంసీలు జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది, విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ దేశానికే ఆదర్శం: పద్మారావు
ఓయూ: సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మందితో శుక్రవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది టీఆర్ఎస్ కార్యకర్తలు, స్టూడెంట్లతో తార్నాక డివిజన్లోని సెయింట్ ఆన్స్ స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వారాసిగూడ, నామాలగుండు క్రాస్‌రోడ్, మీదుగా సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వద్ద ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ మేయర్ జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలోటీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, సునీత, లింగాన్ని ప్రసన్న, అధికారులు, ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ: మంత్రి సబిత
మీర్పేట్: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ విమోచన దినమంటూ వక్రీకరిస్తుందని విద్యాశాఖ మంత్రి అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మీర్పేట్ చౌరస్తా నుంచి బడంగ పేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెట్టి చాకిరి విముక్తి కోసం.. మట్టి మనుషులు చేసిన యుద్ధం.. తెలంగాణ సాయుధ పోరాటం అని అన్నారు. కుల, మతాలకతీతంగా నైజాం నిరంకుశ పాలనకు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం వల్లనే రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజు సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానం, ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రజల త్యాగాలను పోరాటాలను మరిచి నేడు బీజేపీ నాయకులు విమోచన దినమంటూ సభలు ఏర్పాటు చేసి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో నూతనంగా నిర్మాణం చేస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రధానమంత్రి మోడీపై ఒత్తిడి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్ పేట్ కమిషనర్లు నాగేశ్వర్, కష్ణమోహన్ రెడ్డి, ఎమ్మార్వో జనార్దన్ రావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రజల మధ్య బీజేపీ మతచిచ్చు: ఎమ్మెల్యే
అంబర్‌పేట: ప్రజల మధ్య మత చిచ్చు పెడుతున్న బీజేపీని నమ్మొద్దని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా శుక్రవారం అంబర్‌పేట నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ ప్రజల మధ్య కుల, మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ సంగీత, ఎమ్మార్వో లలిత, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, కార్పొరేటర్లు ఇ. విజరు కుమార్ గౌడ్, దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ శిరీష యాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, ఎర్రబోలు నరసింహారెడ్డి, శ్రీరాములు ముదిరాజ్, మహేందర్ రెడ్డి, అమునురీ సతీష్, మహేష్ ముదిరాజ్, లింగారావు, దాత్రిక్ నాగేందర్ బాబ్జి, సదానంద్, వివిధ శాఖల అధికారులు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
భారత్ సంస్థానంలో విలీనం కావడానికి తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాట ఘట్టాలను భావితరాలకు తెలియజేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. వజ్రోత్సావాల్లో భాగంగా శుక్రవారం రాంనగర్ చౌరస్తా నుంచి బాగ్‌లింగంపల్లిలోని సరోజినీ దేవి క్రికెట్ అకాడమీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పవన్ కుమార్, ముషీరాబాద్ ఎమ్మార్వో అయ్యప్ప, డిప్యూటీ డీఈఓ చిరంజీవి, హిమాయత్ నగర్ తహసీల్దార్ చంద్రకళ, టీఆర్ఎస్ యువ నాయకులు ముఠా జై సింహ, సీనియర్ నాయకులు ముచ్చర్తి ప్రభాకర్, టీఆర్ఎస్ రామారావు అధ్యక్షులు రావులపాటి మోజెస్, ప్రధాన కార్యదర్శి మన్నే దామోదర్ రెడ్డి, మాధవ్, దీన్ దయాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్‌బజార్: సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా గోషామహల్ నియోజకవర్గం ఎంజే మార్కెట్ నుంచి నిజాం కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రేమ్ సింగ్ రాథోడ్, ఎం. ఆనంద్ కుమార్ గౌడ్, జి.నందు కుమార్, నాయకులు సంతోష్ గుప్త, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, శశిరాజ్ సింగ్, సల్మాన్, సెమ్మి, నరేష్ గౌడ్, అహ్మద్, గౌస్ పాల్గొన్నారు.