Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ నాయక్
నవతెలంగాణ-ఓయూ
ఎస్టీ రిజర్వేషన్ పెంచుతానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంజారా భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన రిజర్వేషన్ పెంపుపై సీఎం కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గిరిజనులు ముందు వరుసలో ఉన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని, రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాక సమస్యను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మొట్టమొదట ఎస్టీల రిజర్వేషన్ మీదనే సంతకం పెడతానని బహిరంగ సభలో ప్రకటించిన ఆయన మాట నిలబెట్టుకోలేదన్నారు. రిజర్వేషన్లు పెంపు ఆలస్యం కావడంతో ఇప్పటికే ఎస్టీ నిరుద్యోగులు 8 వేల ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. మెడికల్, ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ వంటి వత్తి వత్తిపరమైన సీట్లను గిరిజనులు కోల్పోవడం జరిగిందన్నారు. ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్టీ, ఎస్సీ జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ రిజర్వేషన్ పెంపునకు చర్యలు తీసుకోవాలని లేకుంటే ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం అధ్యక్షులు కర్నాల్ గాంధీ నాయక్, బంజారా సంఘం కార్యదర్శి, ఓయూ జేఏసీ నాయకులు బాలు నాయక్, సురేష్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు చందూలాల్ రాథోడ్, వినోద్ రాథోడ్, సేవాలాల్ బంజారా సంఘం ప్రధాన కార్యదర్శి మాలోత్ నవీన్ నాయక్, భూక్య శేఖర్ నాయక్ పాల్గొన్నారు.