Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రను కించపరిస్తే సహించేది లేదు
- రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
- వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-బోడుప్పల్/ఓయూ/జూబ్లీహిల్స్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజక ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల పోరాట చరిత్రను వక్రీకరించేలా మాట్లాడిన బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి సబ్బండ వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మేడిపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం, ఇతర బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈసందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ అబద్దాలను సమాజంపై బలవంతంగా రుద్దాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరిస్తూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటవీరులు ఐలమ్మ, దొడ్డి కొమురయ్యతో పాటు నాలుగు వేల మంది అమరుల త్యాగాలను విస్మరించే కుట్రలకు బీజేపీ పూనుకుందని అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గుజ్జ రమేష్, బీసీ సంఘం నాయకులు అసర్ల బీరప్ప, సీపీఐ మండల కార్యదర్శి రచ్చ కిషన్,రజక సంఘం నాయకులు సకినాల రవి, జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబు మహాజన్, ఎమ్మార్పీఎస్ కన్వీనర్ పంగ ప్రణరు, నాయకులు కామగళ్ల నరసింహ, వికలాంగుల రాష్ట్ర నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వెంటనే క్షమాపణ చెప్పాలి
వీరనారి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య సాగించిన సాయుధపోరాటాన్ని కించపరిచిన బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే బండి సంజరు పాదయాత్రను అడ్డుకుంటామని ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా.ఎల్చల దత్తాత్రేయ హెచ్చరించారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన విస్తతస్థాయి సమావేశంలో వక్తలు మాట్లాడారు. సాయుధ పోరాటాన్ని కించపరచడం అంటే తెలంగాణ సమాజాన్ని కించపరచడమేనన్నారు. పేదలను, రైతులను పట్టిపీడిస్తున్న దేశ్‌ముఖ్, జాగీర్దారు, పటేల్, పట్వారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మఖ్ధూమ్ మెయినుద్దీన్, బందగీ, ఆరుట్ల కమలాదేవి వంటి వ్యక్తుల చరిత్ర బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డికి తెలియదన్నారు. కార్యక్రమంలో రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య, నిరంజన్ యాదవ్, మల్లేష్ కురుమ, బాలాపూర్ బాల్‌రాజ్, జ్యోతి ఉపేందర్, సకినాల రవి, పెద్దాపురం కుమారస్వామి, అంజయ్య, విద్యార్థి సంఘాల నేతలు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఐలమ్మ విగ్రహానికి నివాళి
తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శుక్రవారం వెంగళరావు నగర్ డివిజన్ కష్ణ కాంత్ పార్కు వద్ద బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ జోన్ రజక వత్తిదారుల సంఘం నాయకులు కే యాదగిరి, ఎస్ బిక్షపతి, లొంక సంపత్, శ్రీనివాస్, ఉపేందర్, మోహన్, ఆసిఫ్, జిల్లా నాయకులు రాపర్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు.