Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుజన విద్యార్థి సంఘాల చైర్మెన్ వేల్పుల సంజయ్
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లతో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని బహుజన విద్యార్థి సంఘాల చైర్మెన్ వేల్పుల సంజయ్ అన్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీని ఓయూ అనుబంధ కళాశాలగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.1000 కోట్ల బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా మౌలిక వసతులతో నూతన మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కోఠి ఉమెన్స్ కళాశాలకు మహిళా యూనివర్సిటీ అని బోర్డు మార్చడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత ప్రభుత్వ విద్యను అందిస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటివరకు 11 ప్రయివేటు యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చారని, వాటిల్లో పేద విద్యార్థులు చదువుకోకుండా చేశారని ఆరోపించారు. మరొక వైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా దివాళా తీయించారని మండిపడ్డారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సరైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. కోఠి మహిళా కళాశాలను ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగానే కొనసాగించాలన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో 500 ఎకరాల స్థలంలో కొత్త మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని బహుజన విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాట్లు చెప్పారు. లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిగంటి వేణుగోపాల్, ఓయూ అధ్యక్షుడు అంబేడ్కర్, వలిగొండ నర్సింహా-దళిత స్టూడెంట్స్ పవర్, డీఎస్పీ ఆనంద్, సత్యం, ఉగేందర్, రాజుకుమార్, శరత్, శివ, రాజు, మహేష్, కుమార్, కొమ్ము స్వామి, ప్రవీణ్, చందు పాల్గొన్నారు.