Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ఫసియుద్దీన్ ప్రోద్భలంతోనే కేసు నమోదు
- టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ విజరుసింహ
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి ఒక మహిళ గొంతు కోసి దాడికి ప్రయత్నించినట్టు తనపై తప్పుడు కేసు బనాయించి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ విజరుసింహ ఆరోపించారు. ఆ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. సోమవారం బోరబండ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను గతంలో ఆరేండ్లు బోరబండ ప్రస్తుత కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ వద్ద పీఏగా పనిచేశానన్నారు. ప్రజలను హింసించటం, అక్రమ దందాలు చేయటం తనకు ఇష్టం లేక అక్కడ మానేసి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ఒక కార్యకర్తగా మాత్రమే తిరుగుతున్నానని చెప్పారు. గొంతు కోశానని కేసు పెట్టిన మహిళ తనకు ఆరు నెలల కిందట ఫేస్బుక్లో పరిచయమైందని, అంతేగానీ ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. భార్యాభర్తల మధ్యలో జరిగిన గొడవలో సదరు మహిళ గొంతు కోసుకొని, బాబా ప్రోద్భలంతో ఆమె తనపై కేసు పెట్టిందని చెప్పారు. తాను నిజంగా నేరం చేస్తే జైలుకు వెళ్తానని, ఈ కేసును నిరూపించకుంటే కార్పొరేటర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి తాను ఇంట్లోనే ఉన్నానని, సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని, పంజాగుట్ట పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మధ్య రాజకీయ వివాదాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేతో ఉండటం బాబాకు ఇష్టం లేక తప్పుడు కేసులు బనాయిస్తున్నాడని ఆరోపించారు. ఆడవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు.