Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటాం
- రజక సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక
నవతెలంగాణ-హైదరాబాద్
వీరనారి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడిన బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని రజక సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక డిమాండ్ చేసింది. సోమవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యత వహిస్తూ ప్రకాశ్ రెడ్డితో క్షమాపణ చెప్పించాలని, లేకపోతే పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. రజకుల ఐక్యతను చాటడానికి త్వరలోనే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే తేదీ, సమయం, స్థలం తెలియజేస్తామని, ప్రతి ఒక్కరూ సైనికుడిలా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మెన్ అక్కరాజు శ్రీనివాస్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, బొడ్డుపల్లి కృష్ణ, గుమ్మడి రాజు నరేష్, పి.వెంకన్న, సకినాల రవి, చాపర్తి కుమార్, కోలిపాక మల్లేశం, గోపీ, బాలాపూర్ బాలరాజు, మొగ్గ అనిల్ కుమార్, ప్రజా సంఘాల, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.