Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిక్డ్స్ వేతనం రూ.10 వేలు ఇవ్వాలి
- సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్
- డీఎంహెచ్ఓ ఆఫీసు వద్ద ఆశా వర్కర్ల ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలో జరుగుతున్న ఆశా వర్కర్లపై వేధింపులు ఆపాలని, పిక్స్డ్ వేతనం రూ.10 వేలు ఇవ్వాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం సికింద్రాబాద్‌లోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆశా వర్కర్ల ధర్నాలో ఆయన మాట్లాడారు. కొంత మంది అధికారులు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, వేధింపుల కారణంగా ఆశా వర్కర్లు తీవ్ర మనోవేదకు గురవుతున్నారని, చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ వ్యాధుల బారినపడుతున్నారని చెప్పారు. ఎవరైనా ఆశా వర్కర్లు ప్రశ్నిస్తే ఇష్టముంటేనే చేయాలని, లేదంటే మానేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారని, ఇది సరైందికాదని అన్నారు. ఈనెల రూ.3,500 పారితోషికం మాత్రమే ఇచ్చారని, దీంతో ఆశాల కుటుంబాల జీవనం సాగించలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ సౌత్జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మీనా మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు ప్రతీరోజు నడిచి నడిచి మోకాళ్లు ఆరుగుతున్నాయని, కొంత మంది మోకాళ్ల ఆపరేషన్ సైతం చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లడానికి కూడా సెలవు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ శ్రామిక మహిళ కన్వీనర్ ఆర్.వాణి మాట్లాడుతూ.. ప్రతీ శనివారం నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ నుంచి ఆశాలను మినహాయించాలన్నారు. గగన్‌మహల్ పీహెచ్సీ, నాంపల్లి ఆస్పత్రిలో ఘటనలకు మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమని, కానీ బస్తీవాసులంతా ఆశావర్కర్లను తిడుతున్నారని, ఏ సమస్య వచ్చినా ఆశాలనే బాధ్యులను చేయడం శోచనీయమని చెప్పారు. ధర్నా అనంతరం డీఎంహెచ్ఓ జె.వెంకటికి నాయకులు మెమోరాండం అందజేశారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు జె.కుమారస్వామి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు టి.యాదమ్మ, ఎం.అనిత, నాయకులు మహేష్, బసంతి, లత తదితరులు పాల్గొన్నారు.