Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోరుగా అక్రమ నిర్మాణాలు
- ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలేరు
- 'రూబీ' ఘటన జరిగినా అధికారుల్లో చలనం లేదు
నవతెలంగాణ-బేగంపేట్
రూబీ హౌటల్, రూబీ ఎలక్ట్రిక్క్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ఏ పాపం తెలియని, విధి నిర్వహణ కోసమే, వ్యాపార అవసరాల నిమిత్తమో రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చిన ఆ 8 మంది తమ ప్రాణాలను ఇక్కడే కోల్పోయారు. ఇది అనుమాసాస్పదం అనుకుంటే పొరపాటే. కానేకాదు ఇది అక్షరాల అన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యం, అవినీతే అనే విషయం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది. నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఇంత మంది చనిపోయినా జీహెచ్ఎంసీ అధికారుల్లో ఏ మాత్రమూ చలనం లేదు. ఎక్కడి వారో కదా ! తమ దాకా వస్తే కదా అనుకున్నారో ఏమో తెలియదు కానీ తమ నిర్లక్ష్యాన్ని మాత్రం వీడటం లేదు. అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతూనే ఉంది.
కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు..
ఇంత ఘోరమైన ఘటన జరిగినా అధికారులు పట్టించుకోక పోగా రాంగోపాల్ పేట్, మోండా డివిజన్లలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా వేగంగా తమ పనులను చేసికుంటూ తమను ఆపే ధైర్యం ఎవరి ఉందని సవాళ్లు విసిరే పరిస్థితి ఏర్పడింది. రూబీ ఘటనలో అక్రమంగా సెల్లార్ నిర్మించ డమే కాకుండా దాన్ని పార్కింగ్ కోసం వినియోగించాల్సి ఉన్నా బైక్ సెల్లార్లో షోరూం చేసి మంటలు రావడానికి ఆ యజమాని కారకుడయ్యాడు. ఇప్పుడూ ఇలాగే మోండా డివిజన్లోని మార్కెట్ పక్కనే భారీ సెల్లార్‌ను అక్రమంగా నిర్మిస్తున్నారు. కానీ జీహెచ్ ఎంసీ అధికారులు కనీసం అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే ప్రాంతంలోని మయూరీ పాన్ షాప్ వద్ద దాదాపు 50 గజాలు కూడా లేకున్నా 4 అంతస్తుల భవనం అగ్గిపెట్టేలా నిర్మిస్తు న్నారు. దీన్ని ఆపే ధైర్యం ఎవరికీ లేదనే వాదన ప్రజల నుంచి వస్తుంది. ఇక ఆర్పీ రోడ్డులోని సిటీ లైట్ హౌటల్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే అక్రమంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తున్నా అధికారుల కండ్లకు కనిపించకపోవడం గమనార్హం. పీజీ రోడ్డు, లక్ష్మినారాయణ కాలనీలో 2012లో ఓ భవనం నాలుగ ంతస్తులు నిర్మించాక కోర్టు కేసులతో ఆగిపోయింది. అలాంటి కేసులున్న భవనం పై ఇప్పుడున్న అధికారులు మరో అంతస్తు నిర్మించుకునేందుకు అనధికారికంగా అనుమతినిచ్చారు. ఇంత కాలం పని చేసిన అధికారులు దాదాపు 10 ఏండ్లు పనులు ఆపితే ఇప్పుడు వచ్చిన అధికారి పెద్ద మొత్తంలో తీసుకుని అక్రమ నిర్మా ణానికి అనుమతించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చెప్పు కుంటూ పోతే చిట్టానే భారీగానే ఉంది. అధికారుల తప్పులతో ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు మాత్రం కనీసం చలించకపోవడం లేదు. కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగుతుం డటం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు.
అందరి అండదండలు..
అక్రమ నిర్మాణాలకు ఇక్కడ ప్రజాప్రతినిధులు, వారి బంధు గణం అండగా నిలుస్తున్నారనేది జగమెరిగిన సత్యం. నిర్మాణ దారుల వద్ద పెద్ద మొత్తంలో పుచ్చుకుని ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోండి మేమున్నామంటూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దీనికి తోడు మిగతా వాటిని అధికారులు తమ ఖాతాలో వేసి కుంటూ మూడు పువ్వులు అరుకాయలుగా తమ జేబులను నింపుకుంటున్నారని స్థానికులు ప్రజలు వాపోతున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై బేగంపేట్ సర్కిల్ ఏసీపీ క్రిస్టఫర్‌ను వివరణ కోరగా.. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.