Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేషన్ కార్యాలయం ముందు కాలనీవాసుల ధర్నా
నవతెలంగాణ-బోడుప్పల్
తమ కాలనీకి చెందిన పార్క్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు యత్నాలు చేస్తున్నారని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమల (సౌత్) కాలనీవాసులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు కాలనీ అధ్యక్షుడు కె.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నెంబరు 63 నుండి 66 వరకు గల కమలనగర్ (సౌత్)లో 1282 గజాల స్థలాన్ని గతంలో లే అవుట్ చేసే సమయంలో పార్క్ స్థలంగా చూపించారని, అందులో కేవలం 600 గజాల స్థలానికి ప్రహరీ నిర్మాణం చేశారని, మిగితా స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. దీనిపై పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, స్థానిక కార్పొరేటర్‌కు అనేకసార్లు వినతిపత్రాలు అందచేశామని, అయిన కూడా ప్రయోజనం లేదని అన్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇదే సందర్భంలో స్థానిక కార్పొరేటర్ కె.సుభాష్‌నాయక్ కలుగచేసుకుని కాలనీవాసులపై నోరు జారడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మాజీ కార్యదర్శి డీఎస్.నాయక్, ప్రధాన కార్యదర్శి ఎల్.కృష్ణ కుమార్, సంయుక్త కార్యదర్శులు ఎస్.నరసింహ, షేక్ హసద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తాం
కాలనీవాసుల ధర్నాతో దిగివచ్చిన మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కమిషనర్ డాక్టర్ రామకృష్ణారావులు మాట్లాడుతూ కాలనీవాసుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన అనంతరం లే అవుట్ ప్రకారం పార్క్ స్థలంగా పరిగణిస్తున్న స్థలంలో ప్రహరీగోడ నిర్మాణం కోసం తీర్మానం చేస్తామని హమీ ఇచ్చారు.