Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 అండర్‌పాస్‌లు, ఆర్యూబీ, ఆర్ఓబీలు
- సిగల్ ఫ్రీ సిటీ కోసం చర్యలు
- ట్రాఫిక్ చిక్కులకు చెక్
- త్వరలో అందుబాటులోకి రానున్న నాగోల్ ఫ్లైఓవర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు పూర్తి మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. సిగల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్ఆర్డీపీలో నగరంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీలు, ఆర్ఓబీలను నిర్మించారు. వీటితోపాటు పలుప్రాంతాల్లో రోడ్డు విస్తరణలు, లింకు రోడ్లను సైతం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ సైతం పూర్తయింది. త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది.
24 ఫ్లై ఓవర్లు :
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీలో భాగంగా 41రకాల రోడ్డు సంబంధిత పనులను చేపట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల శాఖల ఆధ్వర్యంలో 47 పనులను చేపట్టారు. జీహెచ్ఎంసీ సొంత నిధులతో చేపడుతున్న ఎస్.ఆర్.డి.పి ద్వారా మొత్తం 41 వివిధ రకాల పనులను చేపట్టారు. వాటిలో ఇప్పటి వరకు 31 పనులను పూర్తిచేశారు. 2018లో ఆరు, 2019లో నాలుగు, 2020లో 9, 2021లో నాలుగు, 2022లో ఏడు పనులను పూర్తిచేశారు. వీటిలో 24 ఫ్లై ఓవర్లు, 7 అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు ఉన్నాయి.
రూ.212.5 కోట్లతో :
నాగోల్‌లో రూ.212.5 కోట్లతో చేపట్టిన ఫ్లైఓవర్ పూర్తయింది. ఫ్లైఓవర్‌ను భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ రూ.143.58 కోట్ల వ్యయం కాగా, రూ.69కోట్ల వ్యయంతో 990 మీటర్ల ఫ్లైఓవర్ కారిడార్‌ను నిర్మించారు. ఇక్కడ 200 ఫీట్ల మాస్టర్ ప్లాన్‌ను ప్రతిపాదించారు. రెండు మార్గాలు కలిగిన ఫ్లై ఓవర్ 24 మీటర్ల వెడల్పు 6 లైన్ల బై డైరెక్షన్ క్యారేజ్ వేను చేపట్టారు. 23 పిల్లర్స్, 22 స్పాన్స్‌తో 600 మీటర్ల వయాడక్ట్ పొజిషన్ 300 మీటర్ల అప్రోచ్ పొడవుతో వాల్ చేపట్టారు. ఈ ఫ్లైఓవర్‌తో ఎల్బీనగర్ నుండి ట్రాఫిక్‌కు సిగల్ ఫ్రీ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తద్వారా డీజిల్ ఆదా, వాహన వేగం పెరగడంతోపాటు ట్రావెల్ సమయం తగ్గడమే కాకుండా వాహన నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం ఉంది. దీంతోపాటు ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వరకు అక్కడి నుండి వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు గాని సికింద్రాబాద్, ఈసీఐఎల్ వైపు ఉన్న ప్రాంతాలకు వెళ్లే వారికి సులభతరం అవుతుంది. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన మిగతా 15 పనులు మొత్తం 2023 చివరి నాటికి పూర్తికానున్నాయి.