Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు రూ.70 లక్షల విలువచేసే మొబైల్స్ అపహరణ
నవతెలంగాణ-కాప్రా
కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో బుధవారం భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు సీసీ కెమెరాల వైర్లను కట్‌చేసి షోరూంలోని దాదాపు రూ.70 లక్షల విలువచేసే మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలించారు. కుషాయిగూడ సీఐ గురువారెడ్డి వివరాల ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల తర్వాత నిర్వాహకులు బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంను తెరిచారు. మొబైల్స్ విభాగంలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉండటం, ఐఫోన్, వివో, వన్‌ప్లస్ తదితర విలువైన సెల్ఫోన్లు అపహరణకు గురికావడంతో షోరూం నిర్వాహకులు వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీం, డాగ్ స్వ్కాడ్ బృందంతో తనిఖీ చేపట్టారు. షోరూం వెనుకభాగం నుంచి గోడను తొలగించి మొబైల్స్ విభాగంలోని చొరబడిన నిందితులు విలువైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. చోరికి గురైన మొబైల్స్ విలువ దాదాపు రూ.70 లక్షల వరకు ఉంటుందని షోరూం నిర్వాహకులు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.