Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరేం చేశారో చెప్పే దమ్ముందా?
- ప్రతిపక్షాలకు మంత్రి తలసాని
- శ్రీనివాస్ యాదవ్ సవాల్
నవతెలంగాణ-బేగంపేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో తాము చెబుతామనీ, మీరేం చేశారో చెప్పే దమ్ముందా..! అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రశ్నించారు. బుధ వారం బేగంపేటలోని బేగంపేట ప్యాలెస్‌లో బాలానగర్ మండల పరిధిలోని బేగంపేట డివిజన్‌కు చెందిన 365 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావుతో కలిసి ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. దేశ చరిత్రలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్ కింద ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తూ భరోసా కల్పిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో ఉన్నవాళ్ళలో ఎవరైనా మరణిస్తేనే పెన్షన్లు ఇచ్చేవారనీ, నేడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తున్నట్టు వివరించారు. పేదింటి ఆడపడుచుల పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.లక్షా 116 వేల ఆర్ధిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా ఈ పథకం అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ కిట్ కింద ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారనీ, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి ఇంటికీ ఉచితంగా నీటిని సరఫరా చేయడమే కాకుండా నల్లా బిల్లులలను కూడా మాఫీ చేసినట్టు చెప్పారు. వర్షాకాలంలో బేగంపేట నాలాకు వచ్చే వరద నీటితో సమీప కాలనీలు, ఇండ్లు ముంపునకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారనీ, 50ఏండ్లుగా ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోలేద న్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టి రూ.45 కోట్లతో బేగంపేట నాలా అభివృద్ది పనులను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రోడ్ల అభివృద్ధి, పుట్ పాత్ల నిర్మాణం ఫ్లై ఓవర్, అండర్ పాస్‌ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని వివరించారు. ముందు చూపు, ఏదైనా చేయాలనే పట్టుదల ఉంటే అది సాధ్యమన్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం లో అమలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కండ్లు ఉండి చూడలేని కబోదుల్లాగా వ్యవహరిస్తు న్నారని తెలిపారు. అన్ని పండుగలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో గొప్పగా, సంతోషంగా జరుపు కుంటున్నారని తెలిపారు. మన సంస్కతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను దేశ, విదేశాల్లో నిర్వహిస్తున్నారనీ, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే ప్రభుత్వంపై అర్ధంలేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు.