Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా
- డీఎంహెచ్ఎస్ ఆఫీస్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
సర్కార్ దవాఖానలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా అన్నారు. డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలిపోయి ప్రజారోగ్యం ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ ఆఫీస్ ఎదుట రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ నగరంలోని ఉస్మానియా, నీలోఫర్, గాంధీ, ఫీవర్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవని మండిపడ్డారు. పేదలకు వైద్యం చేసే డాక్టర్లు లేక, మందులు అందక ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోయిందని అన్నారు. వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడం అంటే చావును కౌగిలించుకోవడమేనని ప్రజలు భయపడే పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పేట్లబూర్జు ప్రసూతి, కోఠి మెటర్నిటీ ఆస్పత్రుల్లో ఒక్కొక్క కాన్పుకు పైసలు ముక్కు పిండి మరీ వసూలు చేశారని సాక్షాత్తు మంత్రి హరీశ్‌రావుకు మహిళలు చెప్పుకున్నారని తెలిపారు. ఈ ఘటనల వల్ల ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు రవీందర్ చారి, డి గోపాల్, జయరాజ్ యాదవ్, కేడీ దినేష్, విజరు రాఠి, సీహెచ్ ప్రదీప్ గౌడ్, మహిళా నాయకులు అన్నపూర్ణ, దేవి, ఇంద్ర, వి రమేష్, శ్రీనివాస్, వెంకటేష్ చౌదరి పెద్దఎత్తున నాయకులు పాల్గొన్నారు.