Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ రైతాంగ ఉద్యమ నేత, ఏఐకేఎఫ్
- జాతీయ అధ్యక్షుడు కిరణ్జిత్ సింగ్ షేఖాన్
- ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా, నిరసన
నవతెలంగాణ-అడిక్‌మెట్
వ్యవసాయ ఉపకరణాలపై జీఎస్టీ పేరుతో పన్నులు వేయడం సిగ్గుచేటని ఢిల్లీ రైతాంగ ఉద్యమ నేత, ఏఐకేఎఫ్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ జిత్ సింగ్ షేఖాన్ అన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడంలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని, ఉధృత పోరాటాలే వారికి ముక్కుతాడు వేస్తాయని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కిరణ్ జిత్ సింగ్ షేఖాన్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమానికి తలొగ్గినట్లు నటించి క్షమాపణ చెప్పిన ప్రధాని మోడీ ఆచరణలో నేటికీ ఆ చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. హామీ ఇచ్చిన విధంగా నెరవేర్చకపోవడం, మద్దతు ధర చట్టాన్ని రుణ విముక్తి చట్టాన్ని నేటికీ పార్లమెంటులో ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. దీనికితోడు రైతులు పండించిన పంటలు, విత్తనాలు, ఎరువులు పురుగుమందులు, వ్యవసాయ పరికరాలపై వస్తు వినియోగం పన్ను జీఎస్టీ విధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం మోడీ విధానాలనే అవలంభిస్తూ జీఎస్టీని అమలు చేస్తూ రాష్ట్రంలో రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తూ.. ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో తెలంగాణ బహు గొప్పగా ఉన్నదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ధరణి వెబ్‌సైట్‌తో అనేక ఇబ్బందులు
ఏఐకేఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ రాజాదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధరణి వెబ్సైట్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ భూములు పాత రికార్డుల్లో ఉన్న ధరణి పోర్టల్‌లో లేకపోవడంతో రాష్ట్రంలో భూమాఫియా రాజ్యమేలుతున్నదని అన్నారు. ప్రభుత్వం సైతం వారికే వత్తాసు పలుకుతుందని, సర్కారే దళారీగా వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ పచ్చని పంట పొలాలను బీడుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులు అధిక వర్షాలతో పంటల నష్టపోయి అప్పుల పాలై లబోదిబోమంటున్నారని అయినా పంటల బీమా అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. 14 లక్షల మంది కౌలు రైతులు గుర్తింపు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని లక్ష రూపాయల రుణమాఫీ నేటికీ పూర్తి కాలేదన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదని రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళిక సరిగా లేదనిన్నారు. పేరుకే ప్రకటనలు తప్ప ఆచరణలో పంటల ప్రణాళిక రుణాలు ధరలు అమలు కావడం లేదని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకులు ఎం రెడ్డి, హంస రెడ్డి, కుసుంబ బాబూరావు, నాగలి కొమరన్న, మైదామిశెట్టి రమేష్, గడ్డం నాగార్జున, గోనె కుమారస్వామి, సోమిడి శ్రీనివాస్, ఏపూరి సోమన్న, తుడుం అనిల్, తుకారాం నాయక్ లతోపాటు వందలాది మంది రైతులు పాల్గొన్నారు.