Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదరన్ పొలిటికల్ అకాడమీ అధ్యక్షులు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మునుగోడు ఉపఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపిస్తామని సదరన్ పొలిటికల్ అకాడమీ అధ్యక్షులు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. గురువారం నారాయణగూడలోని తాజ్‌మహల్ హోటల్లో 'మునుగోడు ఉపఎన్నికల్లో బీసీ అభ్యర్థి-ఉమ్మడి అభ్యర్థి' అంశంపై ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీలను ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి లక్ష్యంగా సదరన్ పొలిటికల్ అకాడమీ ముందుకు సాగుతుందని చెప్పారు. అందులో భాగంగానే మునుగోడులో ఒక రాజకీయ పార్టీ మద్దతుతో బీసీ అభ్యర్థిని బరిలో నిలిపి గెలిపిస్తామని తెలిపారు. త్వరలో అన్ని బీసీ సంఘాలతో కలసి మునుగోడులో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని సదరన్ పొలిటికల్ అకాడమీని సమర్థిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఉప ఉన్నికల్లో అభ్యర్థిని బరిలో దింపుతామని ప్రకటించారు. సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, సదరన్ పొలిటికల్ అకాడమీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి శేషగిరి గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ అజరు కుమార్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ అన్వర్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు వీజీఆర్ నారగోని, బీసీ టైమ్స్ నేత సూర్యరావు, బీఎంపీ జాతీయ ఉపాధ్యక్షులు దాసురాం నాయక్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్ యాదవ్, బడేసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.