Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్/కంటోన్మెంట్
పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.24 వేల వేతనం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షులు కె.ఏసురత్నం డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం హిమాయత్‌నగర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ తక్కువ వేతనంతో పారిశుధ్య కార్మికులు అర్ధాకలితో కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు పారిశుధ్య కార్మికులకు జీతం కోతల సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. పండుగలు వస్తే రోడ్లు, ప్రదేశాల్లో సాధారణ రోజుల కంటే చెత్త రెట్టింపై మహిళ కార్మికులు వత్తిపరంగా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికుల పొట్టకొట్టే రాంకీ ఒప్పందం రద్దు చేయాలని, జీహెచ్ఎంసీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను క్రమబద్దీకరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు మార్టిన్, నరసింహ, సాయిలు, శారద, లలిత తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనాలు అమలు చేయాలని వినతి
బొల్లారం-కంటోన్మెంట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ డిమాండ్‌చేశారు. గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎం.నర్సింహ మాట్లాడుతూ కేంద్ర లేబర్ కమిషనర్ ఆదేశాల ప్రకారం కార్మికులకు జీతాలు 18 వేలు రావాల్సి ఉండగా.. రూ.14 వేలు మాత్రమే చెల్లిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు జీతాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన జీతం అందేవిధంగా తగుచర్యలు తీసుకుంటామని యూనియన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.