Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
- లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-అడిక్‌మెట్
దేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, బీడీ కార్మికులకు జీవన భతి అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపుమేరకు గురువారం లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి గారడి అటగాడిలా అవతారమెత్తిందని అన్నారు. ప్రజలకు చేసిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాల వాగ్ధానం మాట అటుంచితే, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం మొదలు పెట్టారని ఎద్దేవాచేశారు. ప్రజలను ఓటు బ్యాంక్‌గానే చూస్తూ, దోపిడీకి గురిచేస్తూ, మతాన్ని ముందుకు తెచ్చి జనాలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ప్రయివేటీకరణను బలోపేతం చేయడం, కార్మికులను యాజమాన్యాల చెప్పుచేతుల్లో ఉంచడానికి నాలుగు లేబర్ కోడ్లని తీసుకొచ్చి కార్మికులకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. లక్షలాది మంది పనిచేసే సింగరేణి బొగ్గు బావులను ప్రయివేట్ పరం చేసి, పర్మినెంట్ ఉద్యోగులను వీఆర్ఎస్లతో, కోడ్ ఆఫ్ డిస్ప్లేన్ పేరుతో కార్మికులను పీకివేసి మొత్తం కాంట్రాక్ట్ కార్మికులతో నింపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేజీబీవీ, మోడల్ స్కూల్, మైనార్టీ, అర్బన్, అంగన్వాడీ, ఆశా, తదితర స్కీం వర్కర్స్కు నేటికీ ఉద్యోగ భద్రత లేదన్నారు. వీరిని కార్మికులుగా గుర్తించే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని, బీడీ కార్మికులకు కనీస వేతన జీవోలను విడుదల చేసిన పాపాన పోలేదని తెలిపారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల చెమట చుక్కల ఫలితంగా లక్షల, కోట్ల రూపాయలు సెస్సు వస్తుందన్నారు. ఈనిధులను భవన నిర్మాణ, మోటార్ వాహనాల, ఇతర కార్మికులకు ఉపయోగించకుండా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు. మోటారు రంగ కార్మికులకు నష్టకరమైన 2019 రోడ్ సేఫ్టీ బిల్లును ముందుకు తెచ్చి విచ్చలవిడిగా జరిమానాలు వేస్తుందని చెప్పారు. హమాలీ, మోటారు కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డ్‌ను ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని, తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను, ఎంవీ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, నాయకులు లీలా, మంజు, రాజమణి, నిర్మల, వెంకటమ్మ, రాజు, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.