Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకొని ఎల్బీ నగర్లో పాదయాత్ర చేస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి, ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం మన్సురా బాద్ డివిజన్ పరిధిలోని ఎస్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీి ఎన్నికల్లో తమ పార్టీ కార్పొరేటర్లను గెలిపించి అధికారం కట్టబెడితే, అమలు చేస్తామన్న హామీలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటివరకు ఒక్కటైనా అమలు చేశారా? అంటూ నిలదీశారు. బీజేపీ పక్షాన బండి సంజరు ఇచ్చిన హామీలు ఒకసారి పరిశీలిస్తే గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే వరద బాధితులకు ఇంటికి 25 వేలు ఇస్తామని, వరదలో కారు-మోటర్ వాహనం పాడయిపోతే కొత్త వాహనాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తూ యువతను వేధిస్తున్నందున, తాము అధికారంలోకి వస్తే ఆ చలాన్లు తామే కడతామని చెప్పారని పేర్కొన్నారు. అసలు ట్రాఫిక్ చలాన్ల వ్యవస్థనే రద్దు చేస్తామన్న ఆయన తన హామీల కోసం ఒక్కసారైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారా? అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగని బండి సంజయ్, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి నగర శివారు ప్రాంత ఓటర్లను ఆకర్షించారని గుర్తుచేశారు. ఆ హామీ అమలు కూడా ఆయన చేసిన కృషి ఏమీ లేదన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి గ్రేటర్ ప్రజలను మోసగించిన బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ప్రజల మధ్యకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజరు హామీ ఇచ్చినట్లు గ్రేటర్ కార్పొరేషనే ట్రాఫిక్ చలాన్లు చెల్లించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలను, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలుచేస్తున్న దాఖలాలు కనిపించవనీ, కేవలం ఓట్ల కోసమే గ్రేటర్ ప్రజలను మభ్యపెట్టారని జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒక్క 2019 జూన్ వరకే, కేసులకు గాను 9.12 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలయ్యాయి. 2018లో 6.79 కోట్లు , 2017 లో 8.84 కోట్లు , 2016 లో 10.98 కోట్లు , 2015 లో 11.30 కోట్లు , 2014 లో 21.63 కోట్లు చలాన్ల రూపంలో ఖజానాకు చేరాయి. మరి ఈ డబ్బును గ్రేటర్ కార్పొరేషన్ , పోలీసులకు ఎలా చెల్లిస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా బండి సంజయ్ ప్రజలకు హామీ ఇచ్చారని జక్కిడి ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో లింగోజి గూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, బుడ్డ సత్యనారాయణ, మల్లారపు శ్రీను, గుర్రం శ్రీనివాసరెడ్డి, సతీష్ రెడ్డి, గాంధీ నాయక్. ఇరిగి రమేష్, ఎండి షరీఫ్, శ్రీధర్ గౌడ్, కోలన్ సుధాకర్ గౌడ్, ఎర్ర మహేందర్, వెంకటేష్ గౌడ్, స్వామిగౌడ్, గద గూటి స్వామి, లాలయ్య, చందు నాయక్, ఎం.ఆర్.కె.రెడ్డి, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.